విశాఖపట్నం జిల్లాలో రోజూ ఏదో మూలన గంజాయి వాహనాలు పట్టుకోవడం... నిరంతర ప్రక్రియగా మారింది. ఇలాంటి కేసులు ఎక్కువ మన్యంలోనే నమోదవుతున్నా.. పరిష్కార మార్గం మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఇలా రోజూ నమోదయ్యే గంజాయి కేసుల్లో పట్టుబడిన సరుకు పోలీసు స్టేషన్ల పరిసరాల్లో నిండిపోతోంది. చిక్కిన వాహనాలు వేలానికి నోచుకోక తుప్పుపట్టిపోతున్నాయి.
చాప కింద నీరులా గంజాయి
విశాఖ గ్రామీణ జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, చోడవర , మాడుగుల, పాయకరావుపేట ప్రాంతాల్లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి సిబ్బంది.. మద్యం వ్యాపార పర్యవేక్షణతోపాటు.. గంజాయి రవాణాను అరికట్టాలి. కానీ.. గంజాయి నిర్మూలనే వీరికి ప్రధాన పనిగా మారిపోయింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఈ సాగు విస్తృతి ఎక్కువ. అక్కడి నుంచి ఏదో రూపంలో మైదాన ప్రాంతానికి చేర్చుతోందీ గంజాయి.
అటు గంజాయి కుప్ప- ఇటు వాహనానికి తుప్పు
జిల్లావ్యాప్తంగా ఇటీవలి కాలంలో సుమారు 70వేల కిలోల గంజాయిని పట్టుకున్నట్టు అధికారుల అంచనా. సుమారు 700కుపైగా వాహనాలు చిక్కాయి. హైకోర్టు ఆదేశాలు మేరకు గంజాయిని తగులబెట్టాలి... వాహనాలు వేలం వేయాలి. పాలనాపరమైన సమస్యలతో వాహనాలు తుప్పుపట్టిపోతున్నాయి. గంజాయి గుట్టలు పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కుప్పలు తగ్గడం లేదంటున్నారు అధికారులు.
అవగాహన కల్పించాలి...
గంజాయి సాగు అరికట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చూడండి