దేశ సేవలో భరతమాత ఒడిలో అసువులు బాసిన వీర జవాన్ల స్ఫూర్తితో..సైన్యంలో చేరాలనుకునే యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు రిటైర్డ్ సుబేదార్ అప్పల నరసయ్యరెడ్డి. విశాఖ జిల్లా భీమునిపట్నంలోని నమ్మినవానిపేట మైదానంలో యువతకు ఆర్మీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న ఈ విశ్రాంత ఉద్యోగి..ఆగస్టులో విశాఖలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నద్దం చేస్తున్నారు. దాతల సహకారంతో సుమారు 140 మంది పేద యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
విజయనగరం జిల్లా గూడెపువలసకు చెందిన అప్పలనరసయ్యరెడ్డి..సైన్యంలో చేరాలని కష్టపడుతున్న నిరుపేద యువతకు శరీరధారుడ్య శిక్షణ అందిస్తున్నారు. ఏడాదిగా యువతీయువకులకు తర్ఫీదు ఇస్తున్న ఈ రిటైర్డ్ ఉద్యోగికి కొందరు దాతలు అండగా నిలుస్తున్నారు. తగరపువలసకు చెందిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, డీసీఆర్, వృక్ష ఫౌండేషన్ సంస్థలు అభ్యర్థులకు మెటీరియల్ అందిస్తున్నాయి. భీమిలికి చెందిన సీనియర్ డాక్టర్ ఎన్‌ఎల్ రావు, ఎస్ఆర్ఎల్ డెంటల్ క్లినిక్ వైద్యులు గణేష్ యువతకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఏడున్నర గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న అప్పలనరసయ్యరెడ్డి.. సైన్యానికి ఎంపికయ్యేందుకు అవసరమైన అన్ని విభాగాల్లో సాధన చేయిస్తున్నారు. గ్రామీణ యువతులకు ఉద్యోగ నియామకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపుతున్నారు. దేశానికి సేవలందించే సైనికులుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.
ఇదీ చదవండి: అదే మాట.. అదే తీరు..నెరవేరని దశాబ్దాల కల