భారీ వర్షాలతో విశాఖలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకొరిగాయి. గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో పశు సంపదకు నష్టం వాటిల్లింది. సింహాచలం అప్పన్న మెట్ల మార్గం గుండా వర్షపు నీరు పొంగిపొర్లింది. కోటవురట్ల, ఎస్. రాయవరం మండలాల్లో వరాహ నది ఉగ్రరూపం దాల్చింది. వందల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. నదిని ఆనుకొని ఉన్న ఘాట్ రోడ్డు దెబ్బతింది. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మ విరిగిపడింది. జాతీయ రహదారి పక్కన ఎన్జీవో కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. డ్రైనేజీ సదుపాయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు వాపోయారు. నాతవరం మండలం గన్నవరం వేదుళ్ల గెడ్డలో కారు చిక్కుకోగా అధికారులు జేసీబీతో తొలగించారు. పాడేరులో కోనాం-ఐనాడ మార్గంలో బొడ్డేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా... 50 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మన్యంలో ప్రధాన నది అయిన మత్స్య గెడ్డ పరవళ్లు తొక్కుతోంది. చోడవరంలోని గోవాడ చక్కెర కర్మాగారం పరిధిలో 2 వేల హెక్టార్లలో చెరకు పంట వరద ముంపు బారిన పడింది. స్థానికంగా 4 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా... 10 స్తంభాలు పడిపోయాయి. మారకమ్మరేవు వద్ద భారీ మర్రిచెట్టు నేలకూలింది. ఇటుకల బట్టీలు తడిసిపోయి యాజమానులు లబోదిబోమంటున్నారు. పాయకరావు పేటకు ఆనుకొని ఉన్న తాండవ నదిలో వరద నీరు భారీగా పెరిగింది. పెంటకోటలో ఉప్పుటేరు పొంగి మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. విలువైన వలలు, బోట్ల ఇంజిన్లు గల్లంతయ్యాయి. ఎలమంచిలిలో పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. వాయుగుండం ప్రభావంతో ఒక్క రోజులోనే 7 కోట్ల నష్టం వాటిల్లిందని విశాఖ మహా నగరపాలక సంస్థ కమిషనర్ సృజన వెల్లడించారు.
- విజయనగరం జిల్లాలో
విజయనగరం జిల్లాలో ప్రధాన నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరి పంటకు నష్టం వాటిల్లగా.... పత్తి పొలాల్లోనే తడిసిపోయింది. కళ్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద గండి పడి వరిపైర్లు నీటమునిగాయి. పాచిపెంట మండలం పెద్ద గడ్డ జలాశయం వరదతో మొక్కజొన్న నీట మునిగింది.
- శ్రీకాకుళం జిల్లాలో
శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం గోకర్ణపురంలో సాగరం గెడ్డ ప్రవాహానికి వ్యక్తి గల్లంతయ్యాడు. వాగు దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాతపట్నం మహేంద్రతనయ నదిలో గల్లంతైన వ్యక్తిని స్థానికులు కాపాడారు. బాధితుడు కాజ్‌వేపై నుంచి నడుచుకొని వెళ్తుండగా ఘటన చోటుచేసుకొంది. ఎచ్చెర్ల నియోజక వర్గంలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో 8 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. మొక్కజొన్న, పత్తి, బొప్పాయి, వరి, అరటి, మిరప, చెరకు పంటలకు అపారనష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: