LAND POOLING IN VIZAG ల్యాండ్ పూలింగ్ పేరుతో విశాఖలో వైకాపా నాయకులు భూదందాకు పాల్పడుతున్నారని.. రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని జిల్లాలోని పద్మనాభం మండలం నేరెళ్లవలస గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రైతులను భయభ్రాంతులకు గురి చేసి వైకాపా నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారని రైతులు సర్వత్రా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వైకాపా జడ్పీటీసీ సుంకర గిరిబాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బృందం కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ భూములకు స్కెచ్ వేశారని ఆందోళన చెందుతున్నారు. రైతులకు ముందస్తు సమాచారం లేకుండా, అంగీకారానికి అభిప్రాయ సేకరణ జరపకుండా సంబంధిత భూముల్లో చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అండదండలతో పద్మనాభం మండలంలో వైకాపా నాయకుల రియల్ ఎస్టేట్ దందా సాగుతోందని.. వీరి ఆగడాలను అరికట్టే వారు రాష్ట్రంలో లేరా అంటూ రైతులు వాపోతున్నారు.
చెరువులను సైతం చదును చేసి అమ్ముకుంటున్నారని వాపోతున్నారు. సచివాలయ నిర్మాణం సైతం దౌర్జన్యంగా జిరాయితీ భూమిలో చేపట్టారన్నారు. చెరువులను కబ్జా చేసి చదునుచేసి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారని.. ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కినప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులను ఎమ్మెల్యే అవంతి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారా అని మీడియా ప్రతినిధి అడిగితే.. ఎమ్మెల్యే సైతం వైకాపా నాయకుల పంపకాలను ప్రోత్సహిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఏ క్షణాన ఎటునుంచి తమ భూములకు ఆపద వస్తుందోనని రాత్రింబవళ్లు కనురెప్ప మూయకుండా కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా పద్మనాభం మండలంలో కొనసాగుతున్న వైకాపా నాయకుల దౌర్జన్యాలను అరికట్టి, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ లోకేశ్వరరావును వివరణ కోరగా.. జగనన్న ఇళ్లలో భాగంగా పట్టణ పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు ల్యాండ్ పూలింగ్ చేపట్టామన్నారు. రైతుల్లో అవగాహన కల్పించి వారి పూర్తి సమ్మతితోనే ల్యాండ్ పూలింగ్‌కు ముందుకు వెళ్తామన్నారు.
ఇవీ చదవండి: