యువ ఎంపీలను ఆందించడంలో ఆంధ్రప్రదేశ్ తనదంటూ ఒక విశిష్ట స్ధానం నిలుపుకుంటూ వచ్చింది. ఈసారి కూడా పార్లమెంట్‌కు ఎన్నికైన వారిలో అతి పిన్నవయస్కుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నిలిచారు. యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి మంచి చేయాలన్నదే తన ఉద్దేశమంటున్న మాధవితో ఈటీవీ భారత్ తో తన మనోభావాలు పంచుకున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రాజకీయ యోధుడిని 2 లక్షలకు పైగా ఆధిక్యంతో ఓడించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారామె. చింతపల్లి ఎమ్మెల్యేగా రెండు సార్లు సేవలందించిన తన తండ్రి.... కమ్యూనిస్టు నేత గొడ్డేటి దేముడు వారసత్వంగా మాధవి రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నత చదువులు చదివి పాఠశాలల్లో పీఈడీగా పనిచేశారు. రాజకీయ అరంగేట్రంలోనే ఎంపీ అయ్యారు.
తనకింతటి ఘన విజయం అందించిన గిరిపుత్రుల అభివృద్ధే తన లక్ష్యమంటున్నారు మాధవి. తాగునీరు, పంటలకు గిట్టుబాట ధర, కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గిరిజనులకు అందని ద్రాక్షలా మారిన వైద్యాన్ని చేరువ చేస్తానని ధీమాగా చెప్పారు. మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, నీరు, గృహవసతి, ఆహారంపై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు.
చిన్నప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారిణి అవుదామనుకున్న మాధవి.. వ్యక్తిగత కారణాలతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అయినా... పీఈడీగా ఉద్యోగం సాధించి విద్యార్థులను క్రీడాకారులుగా మార్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎంపీగా ఎన్నికయ్యారు. తాను చేరుకోలేకపోయిన లక్ష్యాన్ని... గిరిపుత్రుల ద్వారా సాధిస్తానని అంటున్నారు. గిరిజనులను ఉత్తమ క్రీడాకారులుగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన వైకాపా అధినేత జగన్ అడుగుజాడల్లో ముందుకు సాగుతానని చెప్పారు.