రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్ఛలవిడిగా సాగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సామాన్యులకు ఇసుక అందక నిర్మాణాలు ఆగిపోయాయని మండిపడ్డారు. ఇసుక మాఫియా వల్ల భవన నిర్మాణ కార్మికులు, ఈ రంగంపై ఆధారపడి ఉన్న వారంతా వీధిన పడుతున్నారని ఆక్షేపించారు. ఇసుక అక్రమాలపై విశాఖ జిల్లా అనకాపల్లిలో ధర్నా నిర్వహించిన ఆయన... ఇసుక కృత్రిమ కొరత సృష్టించి కొంత మంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఇసుక డిపోల వద్ద ఇసుక మాయమవుతున్నా.. చర్యలు తీసుకోవటం లేదని ధ్వజమెత్తారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 14 వేల టన్నుల ఇసుక మాయమైందని ఆరోపించారు. ఇసుక అక్రమాలపై నిరసన తెలపాడానికి వస్తున్న తమ నాయకులను గృహనిర్భంధం చేయటం దారుణమన్నారు. పౌర హక్కులకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన పోలీసులపై కేసు పెడతామని హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టు సాధించడానికి ఉత్తరాంధ్రలో నాయకులంతా రాజకీయాలకతీతంగా ముందుకు రావాలని అయ్యన్న పిలుపునిచ్చారు. ప్రాజెక్టు తగ్గించడం వల్ల ఉత్తరాంధ్రకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు