(Rishikonda Hill resort): రుషికొండపై రిసార్టు పునరుద్ధరణ కోసం జరిపిన తవ్వకాల వ్యర్థాలను బంగాళాఖాతంలో కుమ్మరించేందుకు విశాఖ జిల్లా కలెక్టరు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ఆయనకు ఎక్కడిదని నిలదీసింది. చెత్త వేయడానికి సముద్రం సరైనదని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఏజీ శ్రీరామ్‌ను ప్రశ్నించింది. ఏ నిబంధనలను అనుసరించి కలెక్టరు ఉత్తర్వులిచ్చారో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి రుషికొండను తవ్వుతున్నారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుతో ప్రస్తుత ప్రజాహిత వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన మేరకు హైబ్రిడ్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్, నేరుగా) విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు అనుబంధ పిటిషన్ వేశారని న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దానిపై కౌంటరు వేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. తీరప్రాంత నియంత్రణ (సీఆర్‌జడ్) నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై తవ్వుతూ, చెట్లను కొట్టేస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే.
సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలను వినిపిస్తూ.. కోర్టు ఇచ్చిన పరిధి దాటి నిర్మాణాలు చేపట్టారని, వ్యర్థాలను బంగాళాఖాతంలో వేసేందుకు కలెక్టరు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై ధర్మాసనం వివరణ కోరగా.. కాపులుప్పాడలో నిరుపయోగంగా ఉన్న పార్కు స్థలంలో వేస్తున్నామని, సముద్రంలో కుమ్మరించడం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ చెప్పారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. ఎమ్మెల్యే రామకృష్ణ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలను వినిపిస్తూ.. న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. ల్యాండ్‌స్కేపింగ్ పేరుతో తవ్వకాలు జరుపుతున్నారని, పక్కన ఉన్న బస్ షెల్టర్‌ను కూల్చేశారని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తవ్వకాలు జరిపిన వివరాలు, బస్‌షెల్టర్ కూల్చివేత వివరాలను వీడియో తీసి కోర్టు ముందు ఉంచాలని పిటిషనరును ఆదేశించింది. ప్రభుత్వం, పిటిషనర్లు కోర్టు ముందు ఉంచిన వీడియోలను పరిశీలించి తగిన ఆదేశాలిస్తామని పేర్కొంది.
ఇవి చదవండి..