Water problem in Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భోగిల్లో నీటి సరఫరా లేక ప్రయాణికులు నానా యాతనలు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన దగ్గర నుంచి రైలులో నీళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌లో బయలుదేరి దగ్గర నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఎస్ఎంఎస్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టేషన్‌కి ఈ ఉదయం చేరుకున్న తర్వాత అక్కడ బండి నిలిపివేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రైన్ నిర్వహణ పట్టించుకోకపోవడం ఇటీవల కాలంలో దక్షిణ మధ్య రైల్వేకి ఆనవాయితీగా మారిందనీ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల నీళ్లు నింపకుండానే రైలు బయలుదేరింది.
గతంలో ఇలానే.. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తున్న ట్రైన్లో సుమారు 8గంటల పాటు ఏసీ ఆగిపోవటంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పలుమార్లు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు స్పందించక పోవటంతో విసుగెత్తిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గంట పాటు విజయనగరం రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేసి ప్రయాణికులు ఆందోళన చేయటంతో.. రైల్వే అధికారులు దిగొచ్చి.. సమస్య పరిష్కరించారు. ప్రయాణికులు అందించిన వివరాల మేరకు.. 12774 నంబర్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి షాలిమార్ కు వేకువజామున 3 గంటలకు 30 నిమిషాలకు సికింద్రాబాద్‌లో బయలుదేరింది. అయితే.. ట్రైన్ సామర్ల కోట దాటిన తర్వాత 11 గంటల 30 నిమిషాలకు ఏసీ నిలిచిపోయింది.రైలు మొత్తం ఏసీ బోగిలు కావటంతో.. ప్రయాణికులు గాలి ఆడక ఉక్కపోతకు గురయ్యారు. సమస్యను రైల్వే ఫిర్యాదు నంబర్‌కు.. అధికారులకు సమాచారం అందించారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఫిర్యాదు చేసారు.
ఇదిగో.. అదిగో అంటూ రైల్వే అధికారులు 8గంటల పాటు కాలయాపన చేసారు. విశాఖ రైల్వే స్టేషన్లో బాగు చేస్తామని చెప్పినా.. అక్కడా సమస్యను పరిష్కరించలేదు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల్లోని చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలువురు అస్వస్థత చెందారు. దీంతో కోపోద్రోక్తులైన ప్రయాణికులు.. విజయనగరం రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. రైలు ఆపివేసి.. ఇంజన్ కదలకుండా ముందు అడ్డుగా నిలబడి ఆందోళనకు దిగారు. ప్రయాణికుల ఆందోళనతో దిగొచ్చిన రైల్వే అధికారులు.. మరమ్మతులు నిర్వహించి.. ఏసీని పునరుద్దరించారు. దీంతో.. విజయనగరం రైల్వే స్టేషన్లో గంటన్నర తర్వాత షాలిమార్ ఎక్స్ ప్రెస్ కదిలింది. సమస్య పరిష్కారం కావటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే., పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవటంపై ప్రయాణికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: