విశాఖ జిల్లాలో 70వేల టన్నుల సామర్థ్యంతో కూడిన మూడు ప్రధాన గోదాములు పెందుర్తి, అనకాపల్లి, పరవాడలో ఉన్నాయని పౌర సరఫరాల సంస్థ (సీఎస్‌సి) జిల్లా మేనేజరు పి.వెంకటరమణ అన్నారు. వాటిల్లో సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని నిల్వ చేయనున్నామని అన్నారు. జిల్లాలో బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నందున తొలి విడతలో తూర్పుగోదారి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సార్టెక్స్ చేసిన 35 వేల టన్నుల బియ్యం తెప్పిస్తున్నామని, ఇవి వారం రోజుల వ్యవధిలో విశాఖలోని ప్రధాన గోదాములకు చేరనున్నాయని అన్నారు.
* జిల్లా అవసరాలకు నెలకు 18500 టన్నుల బియ్యం అవసరం. ప్రస్తుతం తాము తెస్తున్న బియ్యం రెండు నెలలకు సరిపోతాయి. తదుపరి జిల్లాలోని 24 సార్టెక్స్ మిల్లుల నుంచి బియ్యం అందుబాటులోకి వస్తుంది. ప్రధాన గోదాముల నుంచి సీఎస్‌సీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఉన్న 30 గోదాములకు పంపి, అక్కడి నుంచి డీలర్లకు సరఫరా చేస్తాం.
ట్రక్కులో ఉండే సదుపాయాలు..
* ట్రక్కు సామర్థ్యం 3 టన్నులు
* ప్రతి వాహనానికి జీపీఎస్ సదుపాయం
* ఎలక్ట్రానిక్ తూకపు యంత్రం
* ఈ-పోసు యంత్రాలు
* ధరలు తెలియజేసే ఎలక్ట్రానిక్ బోర్డు
* డీలరు ఉండేందుకు వసతి
* మైక్‌సిస్టమ్
* డీలరు ఆధ్వర్యంలోనే వాహనం ద్వారా ఇంటింటికి సరకులు అందజేయనున్నారు.
815 ట్రక్కుల కేటాయింపు:
జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయం కేంద్రంగా ఇంటింటికి బియ్యం సరఫరా చేయడానికి 815 ట్రక్కులు కేటాయించారు. అవి వారం రోజుల్లో విశాఖ చేరుకొనే అవకాశం ఉంది. ఆయా వాహనాలను ఒకే చోట ఉంచేందుకు పాతనగరంలోని మున్సిపల్ స్టేడియం, బీచ్ రోడ్డులోని ఏపీఐఐసీ స్థలాలను పరిశీలించాం. తొలి విడతలో 400 వాహనాలు వచ్చే అవకాశం ఉంది. మండలాల వారీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేన్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చురుగ్గా సాగుతోంది.
జిల్లా అవసరాలకు 15 లక్షల సంచులు:
బియ్యం కార్డుదారుల చిరునామాలు మ్యాపింగ్ చేయడం వల్ల ఇక నుంచి రేషను డిపోకు వెళ్లి సరకులు తీసుకొనే పరిస్థితి ఉండబోదు. జనవరి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన సంచుల్లో సరకులు అందజేయనున్నారు. జిల్లా అవసరాలకు 15లక్షల పది, 15 కిలోల సామర్థ్యంతో కూడిన సంచులు జిల్లాకు వస్తున్నాయని సీఎస్‌సీ జిల్లా మేనేజరు వెంకటరమణ వివరించారు.
ఇదీ చదవండి: