విశాఖ మన్యంలో డయేరియా విజృంభిస్తోంది. డుంబ్రిగుడ మండలంలోని పోతంగి గ్రామంలో వాంతులు, విరేచనాలతో 40 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రక్షిత మంచినీరు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... తరచూ రోగాలు తమను వేధిస్తున్నాయని గిరిజనులు వాపోతున్నారు.
గ్రామంలోని తాగునీటి అవసరాలకు కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి పైకప్పు లేకపోవడంతో నీరంతా కలుషితమవుతోందని గిరిజనులు అంటున్నారు. నీరు నాచు పట్టి తాగేందుకు వీలు లేని విధంగా ఉన్నాయంటున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నీళ్లే తాగుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
మంచాన పడ్డ గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీ వైద్యులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని వారందరికీ మందులు అందించి.. ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు.
తాగునీటి ఇబ్బందులతో తరచూ రోగాల బారిన పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.