GIRIPRADAKSHINA: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో విశిష్టతను సంతరించుకున్న గిరి ప్రదక్షిణకు భక్తులు తరలివస్తున్నారు. అధికారికంగా మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి పుష్ప రథం ప్రారంభమవుతుంది. కానీ ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ సుమారు 32 కి.మీ మేర కొనసాగనుంది. సింహాచలం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్డు, సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం చేరుకోనున్నారు. తొలి పావంచా దగ్గర సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గిరిప్రదక్షిణతో సింహగిరి సమీపంలోని అడివివరం గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. పాత గోశాల కూడలి, పాత అడవివరం కూడలి వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు బయటకి వెళ్లి వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.
10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా..
మరోవైపు విశాఖనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. గిరిప్రదక్షిణ మార్గంలో వాహనాలను అనుమతించకుండా నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. భారీ వాహనాల నగరంలోకి రాకుండా సోమవారం రాత్రి నుంచే చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత గిరిప్రదక్షిణకు అధికారులు అనుమతి ఇవ్వడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 10లక్షల మంది వస్తారని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారికంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు ఉదయం వరకు గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. దీనికోసం 2వేలకు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: