విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన శతాధిక వృద్ధుడు, మలేషియాలో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన బుద్ద అప్పలనాయుడు(100) మంగళవారం మలేషియాలో మృతిచెందారు. ఈయన తండ్రి మహాలక్ష్మి నాయుడు 1928లోనే మలేషియాలో స్థిరపడ్డారు. అప్పలనాయుడు అక్కడే జన్మించి, అక్కడే తెలుగు నేర్చుకుని ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించారు. మలేషియా తెలుగు సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ దేశంలో వివిధ రాష్ట్రాల్లో తెలుగు శాఖలు ఏర్పాటు చేశారు. ఈ కృషికి గుర్తింపుగా 1978లోనే ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది.
మలేషియా వలస వెళ్లిన తొలితరం తెలుగువారి అనుభవాలపై 2006లో ‘మధుర స్మృతులు’ పేరిట కొన్ని కథలు, వాడుక భాష పైనా పుస్తకాలు రాశారు. ఇతను నూకాలమ్మ భక్తుడు. అనకాపల్లి నూకాలమ్మ కోవెల అభివృద్ధికి ఆయన తరచూ విరాళాలు ఇస్తుండేవారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురు విశాఖలో ఉండగా మిగిలిన వారు మలేషియాలో ఉంటున్నారు.
ఇవీ చదవండి...కాల్చే ఆకలి....కూల్చే వేదన