విశాఖపట్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో.. కొవిడ్ సహాయ సామగ్రి బుగ్గిపాలవ్వడం దురదృష్టకరమని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ పేర్కొన్నారు. ఉన్నత భావాలతో శ్రమించే తానా సభ్యులు, నాయకుల కృషి అగ్నికి ఆహుతైందని వాపోయారు. ఈ దుర్ఘటనకు దారి తీసిన కారణాలు, దగ్ధమైన సహాయ సామగ్రికి బీమా వచ్చే అవకాశాలను రెడ్‌క్రాస్ సాయంతో పరిశీలిస్తున్నామని వారు ఒక ప్రకటనలో వివరించారు.
‘తానా ఫౌండేషన్, నార్త్‌వెస్ట్ మెడికల్స్-చికాగో వారి సౌజన్యంతో సుమారు 3 మిలియన్ డాలర్ల విలువైన కరోనా సహాయ సామగ్రిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అందజేసే కార్యక్రమానికి తానా శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరిలో 20 కంటెయినర్ల సామగ్రి విశాఖ పోర్టుకు చేరినా షిప్‌మెంట్ల రద్దీ, డాక్‌యార్డులో స్థలం, కస్టమ్ క్లియరెన్స్ తదితర కారణాల వల్ల కొంత జాప్యమైంది. రవాణా జాప్యానికి షిప్పింగ్ కంపెనీకి రూ.30 లక్షలు, దిగుమతిలో జాప్యానికి రూ.20 లక్షల జరిమానా విధించగా రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన శివారెడ్డి, పోర్టు కార్యదర్శి సహకారంతో రద్దు చేయించి గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ సంస్థలో నిల్వ చేశాం. జూన్ రెండో వారంలో రెడ్‌క్రాస్ సహకారంతో ఏపీ గవర్నర్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించాం. అయితే జూన్ 1న వాతావరణ మార్పుల కారణంగా గోదాముల్లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి కొవిడ్ సామగ్రి బుగ్గిపాలైంది’ అని వివరించారు.
‘సంఘటన లోతుపాతులు తెలుసుకోకుండా కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం దురదృష్టకరం. తానా ఎప్పుడూ పారదర్శకతకు కట్టుబడి ఉంటుంది. దీనిపై ఎలాంటి సమాచారమైనా ఇచ్చేందుకు సిద్ధమే’ అని తెలిపారు.
ఇవీ చూడండి: