దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో విశాఖ నగర పోలీసు కమిషనరేట్ ద్వితీయ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో 34 మెట్రోపాలిటన్ నగరాల్లో (పది లక్షలకు మించిన జనాభా) జరుగుతున్న నేరాల సరళిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విశ్లేషించింది. ఆయా నగరాల్లో చోటుచేసుకున్న మొత్తం సైబర్ నేరాల్లో 14.4 శాతం నేరాలు విశాఖలోనే జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తొలి స్థానంలో వారణాసి(16.1శాతం) ఉండగా తృతీయ స్థానంలో అలహాబాద్(12.7శాతం) నిలిచింది. 2019లో విశాఖలో మొత్తం 400 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులైన 65 మందిపై ఛార్జిషీట్లు వేశారు. విశాఖ నగర జనాభా 17.3లక్షలుగా పరిగణించి నగరంలో ప్రతి లక్ష మందిలో 23 మంది సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నట్లు తేల్చారు.
మహిళలపై జరుగుతున్న నేరాల్లో కూడా విశాఖ మూడో స్థానంలో ఉండడం మరో ఆందోళనకర పరిణామం. విశాఖలో మొత్తం 1217 మంది మహిళలు నేరాలకు గురైనట్లు తేల్చారు. ఫరీదాబాద్, భోపాల్ తరువాత మూడో స్థానంలో విశాఖ నగరం ఉండడం గమనార్హం. విశాఖలోని ప్రతి లక్ష మందిలో 141 మంది మహిళా బాధితులున్నట్లు తేల్చారు.
ఆర్థిక సంబంధ నేరాలు నగరంలో ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది. జోధ్‌పూర్, త్రిస్సూర్, వారణాసి నగరాల తరువాత విశాఖలోనే ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. ఫోర్జరీలు, మోసాలు తదితరాలను కూడా ఇందులోనే చేర్చారు. ప్రతి లక్ష మందికి 51 మంది ఆర్థిక నేరాల బారిన పడుతున్నట్లు తేల్చారు. 2019వ సంవత్సరంలో విశాఖలో మొత్తం 883 మంది ఆర్థిక నేరాల బారిన పడినట్లు తేల్చారు. 34 నగరాల జాబితాలో విశాఖ ఆర్థిక నేరాల విషయంలో నాలుగో స్థానంలో ఉండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
కిడ్నాపులు, అదృశ్యం కేసుల్లో విశాఖ కమిషనరేట్ 15వ స్థానంలో ఉంది. ప్రతి లక్ష మందికి 10 మంది కిడ్నాప్‌లకో, అదృశ్యాలకో గురవుతున్నారు. 2018తో పోలిస్తే గత సంవత్సరంలో ఆయా కేసుల సంఖ్య తగ్గింది. దేశంలోని ఆయా 34 నగరాల్లో జరిగిన మొత్తం అదృశ్యం/కిడ్నాప్ నేరాల్లో 3.1శాతం విశాఖలో జరుగుతున్నాయి. ఆయా కేసుల్లోని బాధితుల్లో మొత్తం 146 మంది జాడను పోలీసులు గుర్తించగలిగారు. మిగిలినవారి ఆచూకీ మాత్రం మిస్టరీగా మిగిలింది. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు కిడ్నాప్/ అదృశ్యం అయినవారు(పాత కేసులతో కలిపి) 2019 సంవత్సరాంతానికి మొత్తం 280 మంది ఉన్నట్లు తేల్చారు.
పిల్లలపై జరుగుతున్న దాడుల్లో విశాఖ నగరం 16వ స్థానంలో ఉంది. నేరాల్లో భాగస్వాములవుతున్న బాలల సంఖ్య విశాఖలో పెరుగుతున్నట్లు గుర్తించారు. 2019వ సంవత్సరంలో మొత్తం 119 మంది బాలలకు నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు తేల్చారు.
అన్ని రకాల ఇండియన్ పీనల్ కోడ్(ఐ.పి.సి.), ఇతర నేరాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం నేరాల తీవ్రత ఒకింత తగ్గడం విశేషం. 2018వ సంవత్సరంలో 7,877 నేరాలు చోటుచేసుకోగా 2019వ సంవత్సరంలో ఆ సంఖ్య 6850కి పరిమితమైంది. ఆయా మొత్తం నేరాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి లక్షమంది జనాభాలో 396 మంది ఏదో ఒక నేరానికి గురవుతున్నారు. ఆయా 34 నగరాల జాబితాలో విశాఖ 22వ స్థానంలో నిలిచింది.