సాగర తీరంలో కరోనా మృత్యుఘోష మోగిస్తోంది. రోజూ పదుల సంఖ్యలోనే.... కరోనా రోగులు చనిపోతున్నారు. నగరంలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న వారు.. కింగ్‌జార్జితో పాటు విమ్స్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇవి రెండూ ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రైవేటు ఆసుపత్రులలోనూ పెద్ద సంఖ్యలోనే కొవిడ్ బాధితులు చేరుతున్నారు. ఇదే సమయంలో పరిస్థితి విషమించి అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. మరణాల లెక్కల విషయంలో మాత్రం స్పష్టత లోపిస్తోంది.
ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారు మరణిస్తేనే దాన్ని కొవిడ్ మరణంగా ధ్రువీకరించాలని నిర్దేశించింది. అదే ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా నగరంలోని ఆసుపత్రుల్లో రోజూ పదుల సంఖ్యలోనే మృత్యువాత పడుతున్నా..వారిని లెక్కల్లోకి చేర్చడం లేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా కరోనాతో ఎంతమంది మరణించారనే విషయం వెలుగులోకి రావడం లేదు.
పరిస్థితి విషమించి చనిపోయిన వారి మృతదేహాలను తరలించేందుకు.... కేజీహెచ్‌లో తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడమూ సమస్యగా మారింది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: సింహాద్రి అప్పన్న ఆలయ దర్శన వేళలు కుదింపు