విశాఖలో కరోనా పరీక్షల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో పెద్ద ఎత్తున కేసులు వస్తున్న పరిస్థితిని గమనించిన యంత్రాంగం ఇక్కడ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ వినయ్‌చంద్ రాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 3300 మందికిపైగా పరీక్షించగా.. ఇందులో 500 వరకు కేసులు రావడం కలకలం రేపుతోంది. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతం గాజువాక, శ్రీహరిపురం, పెందుర్తి, అనకాపల్లి , నర్సీపట్నం నుంచి ఈ కేసులు వచ్చాయి. జన సాంద్రత, ఎక్కువ నివాస సముదాయాలు ఉన్న శివారు ప్రాంతం మధురవాడలో కూడా ఈ కేసులు ఎక్కువ వెలుగు చూశాయి. ఇందులో హైరిస్క్ కేటగిరిలో ఉన్న 60 ఏళ్ల పైబడిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరందరినీ కోవిడ్ కేంద్రాలకు, తీవ్ర లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. నిర్ధిష్టమైన లెక్కలు ఇంకా ప్రధాన కేంద్రానికి చేరాల్సి ఉందని, అప్పుడు లెక్కలు ప్రకటిస్తామని జిల్లా కోవిడ్ సమన్వయకర్త డాక్టర్ పీవీ. సుధాకర్ వెల్లడించారు.
ఇదీ చూడండి. వీర జవానుకు విశాఖ ఐఎన్ఎస్ డేగ సైనికా వందనం