వేసవి వచ్చిందంటే చాలు... తెలుగు ఇంట ఆవకాయ సందడే సందడి. మామిడి కాయల కొనుగోలు దగ్గర నుంచి అవగుండ, కారం, ఉప్పు కలిపి మామిడి ముక్కలకు పట్టించి... నూనె నిండుగ పోసి జాడీలకు ఎత్తించి ఏడాదంతా ఆరగించడం తెలుగువారికే చెల్లు. ఆవకాయ ప్రాథమిక సూత్రం కూడా ఇదే. అయినా వివిధ ప్రాంతాల్లో వారి రుచులకు అనుగుణంగా దీనిలో కారం అవకాయ, తీపి అవకాయ, మాగాయ...ఇలా రకరకాలుగా సిద్దం చేస్తారు. అవసరాన్ని బట్టి ఇవి పచ్చళ్లుగానూ నోరూరిస్తుంటాయి.
ఏప్రిల్, మే నెలల్లో ఎండలకు అనుగుణంగా జోరుగా సాగే ఈ పచ్చళ్ల వ్యాపారం.. ఈఏడాది కరోనా దెబ్బకు కుదేలైంది. దీనిని వ్యాపారంగా ఎంచుకున్న విశాఖ జిల్లా హరిపాలెం వాసుల పరిస్థితి దయనీయంగా మారింది. తీపి అవకాయకు హరిపాలెం పెట్టింది పేరు. దాదాపుగా ఈ గ్రామంలో 300 కుటుంబాలు ఈ అవకాయ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. సీజన్లో ఈ ఆవకాయకు మంచి డిమాండ్. చూట్టూ పక్కల గ్రామాలకే కాక...ఇతర రాష్ట్రాలకు సైతం వీరు ఎగుమతి చేస్తుంటారు.
ఆ రహదారులపై ఎటుచూసినా అవే...
హరిపాలెంలో వేసవిలో రహదార్లు ఏవీ ఖాళీగా ఉండవు. ఎక్కడ చూసినా...పెద్ద పెద్ద టార్పాలిన్లు పరిచి మామిడికాయ ముక్కలు ఎండబెట్టే దృశ్యాలే దర్శనమిస్తాయి. ఎండకాలంలో వాహనాలను అటువైపు దాదాపుగా రానివ్వరు. ఎండిన మామిడి ముక్కలను అవసరానికి అనుగుణంగా ఆవ ఊట, బెల్లంతో కలిపి రుచికరమైన అవకాయగా సిద్దం చేస్తారు. కుటీర పరిశ్రమగా మహిళలు దీనిని ఎంచుకుని తమ కుటుంబాలను ధీమాగా నడిపించేస్తారు. అటువంటి వీరికి ఇప్పుడు కరోనా కష్టాల ముంగిట చేర్చింది.
అమ్మకాలు లేక... బతుకులు విలవిల
లాక్ డౌన్లోనే మొత్తం సీజన్ అంతా పోయింది. ఎలాగోలా కాయలు తెచ్చి ముక్కలను ఎండబెట్టి సిద్దం చేశారు. ఇప్పుడు డ్రమ్ములకు డ్రమ్ములు ఇవి పేరుకుపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల కలిపిన ముక్కలు కూడా డ్రమ్ముల నిండా ఉండిపోయాయి. ప్రతిఏటా వీటి అమ్మకాల జోరుగా సాగటం వల్ల... సరకు సరిపోయేది కాదు. ఇప్పుడు కొనేనాథుడే కరవు అవటంతో..వీటిని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు హరిపాలెం వాసులు.
ఈ గ్రామంలో ఈ అవకాయ తయారీ కొన్నిదశాబ్దాలుగా నిర్వహిస్తున్నామన్నది వయో వృద్దుల మాట. ఒక్కొక్కరూ కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా మహిళలు స్వయంగా ఆర్దికంగా నిలద్రొక్కుకునేందుకు కూడా అవకాయ అవకాశం కల్పించింది. కరోనా కొట్టిన దెబ్బకు ఈఏడాది ముక్కలను ఏం చెయ్యాలన్నది వీరికి ప్రశ్నార్ధకంగా మారింది.
చిన్న తయారీదారు అనుకుంటే రెండు నుంచి మూడు లక్షల రూపాయిల పెట్టుబడి పెట్టడం, పెద్ద తయారీదారు ఏకంగా పది లక్షల వరకు పెట్టబడి పెట్టి ఈ ఆవకాయ వ్యాపారం చేస్తారు. గ్రామగ్రామానికి వెళ్లి అమ్మకాలు కూడా వీరిలో కొందరు చేస్తారు. వెరసి ఇవన్నీ ఇప్పుడు లేకపోవడం వీరి జీవితాలను అగమ్యగోచరంగా మార్చింది. కరోనా దెబ్బకు హరిపాలెం అవకాయ మగువలు దిగాలైపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్: పరిమితంగానే వినాయక విగ్రహాల తయారీ