వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు తమను రెగ్యులరైజేషన్ చేయాలనే ప్రధాన ధ్యేయంగా విశాఖలో మూడు రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజు మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తాను అధికారంలోకి వస్తే తప్పకుండా రెగ్యులైజేషన్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచిన పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఇచ్చిన హామీ నెరవేరిస్తే విలువైన ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని క్యాడర్ల ఉద్యోగుల కృషికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుండటం ఆనందదాయకం అన్నారు.
అయితే గత ఇరవై ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ భద్రతా లేకుండానే ప్రాణాంతక మహమ్మారి కరోనా కట్టడికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలు చేస్తున్నా.. కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల పట్ల ఎందుకు జాలి, దయ కలగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు కమిటీల పేరుతో తమ క్రమబద్ధీకరణ తీవ్ర కాలయాపన చేసి దగా చేశాయని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించామన్నారు. కానీ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుండటంతో ఉద్యమబాట పట్టామన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించదలిచామని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ.. వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో.. ఆరుగురు అరెస్టు