విశాఖ జిల్లా పాడేరు మండలం బడిమేల పంచాయితీలో కొలంబో పేరుతో ఓ గిరిపల్లె ఉంది. శ్రీలంక రాజధాని కొలంబో పేరు ఈ గిరిపల్లెకు ఎలా వచ్చిందని అనుకుంటున్నారా..!. పూర్వం ఈ పల్లెలో కోలం చెట్లు ఉండేవట. వాటి నుంచి లభించే కాయలను కోలం గాయలు అని పిలిచేవారు. గిరిజనుల యాసలో కోలం గాయులు కాస్తా.. కొలంబోగా మారిపోయింది. అప్పటి నుంచి ఈ పల్లెను కొలంబోగా పిలవడం ప్రారంభించారు.
పోడు వ్యవసాయమే ఆధారం
కొలంబో గ్రామంలో సుమారు 300 మంది వరకూ ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా కొండ పోడు వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. అడవుల్లో దొరికే పండ్లను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటామని గ్రామస్థులు తెలిపారు.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది ఈ గిరిజన పల్లె పరిస్థితి. ఓ దేశపు రాజధాని పేరును కలిగి ఉన్నా... అక్కడి వసతులు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటికి ఆ పల్లెలో ఎలాంటి మౌలిక వసతులు లేవు. ఎక్కడ చూసినా.. మొండి గోడలే దర్శనమిస్తాయి. ఎప్పడో ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన పెంకుటిళ్లు తప్ప అక్కడ మరేమీ కనబడవు.
ప్రభుత్వాలు మారినా... ఫలితం శూన్యం
ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ పల్లెలకు రావని గిరిజనులు వాపోతున్నారు. తమ పల్లెలో ఇప్పటి వరకు సరైన మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదని చెబుతున్నారు.
"మా గ్రామానికి సంక్షేమ పథకాలు రావు. అధికారులను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం ఉండదు. గృహనిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేసుకున్నా...అధికారులు బిల్లులు మంజూరు చేయటం లేదు. ఓ దేశానికి రాజధాని పేరు మా గ్రామానికి ఉన్నా..మౌలిక సదుపాయలు మాత్రం లేవు. ప్రభుత్వం ఇప్పటికైనా మా గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి."
-అప్పన్న , కొలంబో గ్రామస్థుడు
తమ గ్రామం పేరుకు ప్రత్యేకత ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా దత్తత తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.