CM YS Jagan tour : సీఎం వైఎస్ జగన్ మే 3 వ తేదీన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టడం సహా విశాఖపట్నం – మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 3 వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శిస్తారు, భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన అనంతరం 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
సవరవిల్లి వద్ద బహిరంగ సభ.. సీఎం జగన్... సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు 10.55 గంటలకు చేరుకుని... సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30గంటలకు వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొని.. స్థానికంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయల్దేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదించి.. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయల్దేరుతారు. సాయంత్రం 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు, 5.30 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 6.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
నిర్వాసితుల వెతలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం... 2,200 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించి పీపీపీ పద్ధతిలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. భోగాపురం విమానాశ్రయ నిర్వాసితులైన మరడపాలెంలో 223, ముడసర్లపేటకు చెందిన 33 కుటుంబాలకు.. పోలిపల్లి రెవెన్యూ పరిధిలోని లింగాలవలసలో పునారావాస కాలనీ నిర్మాణం చేపట్టింది. బొల్లింకలపాలెం నుంచి 55, రెల్లిపేటకు చెందిన 85 కుటుంబాలకు గూడెపువలసలో కాలనీ ఏర్పాటు చేశారు. అయితే కాలనీల్లో 70శాతం ఇళ్లు మాత్రమే పూర్తయినా.. అధికారులు నిర్దయగా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వాసితులు గుండెల నిండా బాధతో ఊరు విడిచి వెళ్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొందరు బిక్కుబిక్కుమంటూ ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు.
స్థానికేతర సమస్యతో... నిర్వాసిత గ్రామాలకు చెందిన మరికొందరు ప్రజలు స్థానికేతర సమస్యను ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 కుటుంబాలకు చెందిన వారు.. ఉపాధి కోసం విజయవాడ, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటూ.. అప్పుడప్పుడూ సొంతూళ్లకు వచ్చి వెళ్తుంటారు. ఆధార్, రేషన్, ఓటరు కార్డులన్నీ ఉన్నా.. స్థానికులు కాదంటూ పునరావాస కాలనీలో స్థలాలు కేటాయించక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇవీ చదవండి