CM Jagan Role in Setting up Infosys Center : ఇన్ఫోసిస్ తరహాలో రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు వస్తాయని సీఎం జగన్ సోమవారం డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభ సభలో గొప్పగా చెప్పారు. కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకొచ్చే క్రమంలో ఇన్ఫోసిస్ సంస్థ టైర్-2 నగరాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉత్తరాంధ్రలోని ఉద్యోగులు 1000 మందిని రప్పించేలా ప్రణాళిక రచించింది.
YSRCP Government on IT Development in AP : ఆర్థిక మండలి ఆంక్షలతో కూడిన భవనాలు తనకు వద్దని, ఐటీ సెజ్‌లో డీనోటిఫై చేసిన భవనాలు పరిశీలించి చివరకు హిల్-2 సమీపంలోని మౌరి టెక్ భవనాన్ని ఆ సంస్థ ఎంపిక చేసుకుంది. అసలు హిల్-2లో జరిగిన స్థల కేటాయింపులన్నీ చంద్రబాబు హయాంలోనివే. ఇన్ఫోసిస్ ను విశాఖకూ విస్తరించాలని ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించినట్లు 2017 జనవరి 20న నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ట్వీట్ చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఇదే భవనంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో నడిచే పలు సంస్థలకు అవకాశం కల్పించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అక్కడున్న సంస్థలు ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లిపోవడంతో ఆ భవనం ఖాళీగా ఉంది. దాన్నే ఇప్పుడు ఇన్ఫోసిస్ అద్దెకు తీసుకుని కేంద్రం పెట్టుకుంది. ఓ ప్రైవేటు కంపెనీ అయిన ఇన్ఫోసిస్, ఓ ప్రైవేటు భవనం అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటుచేసుకుంటే అందులో ప్రభుత్వ పాత్ర ఏంటి? ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా వర్క్ ఫ్రం హోంకు వెళ్లిన పాత వారికే తప్ప కొత్త ఉద్యోగాల భర్తీ చేయనప్పుడు అంతలా హంగామా ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
YCP Government not Giving Arrears of Subsidies to IT Companies : నాలుగున్నరేళ్లుగా విశాఖలోని 86 ఐటీ కంపెనీలకు 22 కోట్ల రూపాయల రాయితీలు విడుదల చేయకుండా ప్రభుత్వం బకాయి పెట్టింది. ఇందులో కాన్సంట్రిక్స్ కంపెనీకి 3.05 కోట్లు, సైకేర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 1.90 కోట్లు, సింబాసిస్ టెక్నాలజీస్‌కు రూ.1.05 కోట్లు, ఇన్‌స్పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.53.87 లక్షలు, కిసాన్ మీడియా ఇన్నోవేషన్‌కు 3 లక్షలు రాయితీగా చెల్లించాల్సి ఉంది.
ఏటా CFMS నంబరు మార్చి ఇవ్వడమే తప్ప కంపెనీల ఖాతాల్లో రాయితీలు జమ చేయడం లేదు. 10శాతం పర్సంటేజీ ఇచ్చినవారికే డబ్బులు పడుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గత ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే రాయితీలు విడుదల చేస్తామంటూ ఉత్తుత్తి వాగ్ధానాలు చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ అసోసియేషన్ సభ్యులకు కానీ, రుషికొండ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కు అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న విష్ణుకుమార్ రాజుకు కానీ ఆహ్వానం పంపలేదు. రాయితీలు అడుగుతారని స్థానికంగా ఉన్న ఐటీ కంపెనీల ప్రతినిధులెవరినీ పిలవలేదు.
Prathidwani: ఐటీ విస్తరణ, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఏపీ ఎక్కడ..?