స్థానిక ఎన్నికల్లో ఓటరు చూపు అభ్యర్థి మీదే ఉంటుంది. కానీ ఆ అభ్యర్థి మాత్రం పార్టీ గుర్తుమీదే బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థి వెంట పార్టీ శ్రేణులుండి ప్రజల్లోకెళ్లినప్పుడే ఆశించినంత విజయం వస్తుంది. అయితే ఇప్పుడు ఆ కేడర్‌లో చాలా మార్పులు చేసుకుంటున్నాయి. చేరికలతో అధికార పార్టీ బలపడుతున్నప్పటికీ.. ప్రత్యర్థులు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక సమయంలో సమీకరణలతో పోల్చితే.. మార్పుచెందుతున్న సమీకరణలతో చాలా విషయాలు బయటపడుతున్నాయి.
భీమిలి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 2,25,627... వైకాపా - 1,01,629, తెదేపా - 91,917, జనసేన - 24,248
భీమిలి వార్డుల్లో బలనిరూపణ..
నియోజకవర్గంలోని జీవీఎంసీ వార్డుల్లో వైకాపా కేడర్ బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇదివరకే తెదేపా వర్గీయులు వైకాపాలోకి చేరారు. అందులో కీలక వ్యక్తులున్నారు. విలీన గ్రామాల్లో పరిస్థితి చూస్తే.. తెదేపా వర్గీయులు కాస్త బలంగానే ఉన్నారు. అయితే కిందిస్థాయి కేడర్ వైకాపాలోకి వెళ్లినా ప్రభావం ఉండదని అంటున్నారు. ఆయా వార్డుల్లో బలమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తెదేపా శ్రేణులు నాయకత్వలోపంలో బయటికి వచ్చేందుకు జంకుతున్నట్లు చెబుతున్నారు. జనసేన స్తబ్దుగా ఉంది.
విశాఖ తూర్పు అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,72,063... తెదేపా - 87,073, వైకాపా - 60,559, జనసేన - 17,873
పోటీ మాత్రం తగ్గేట్టు లేదు..
ప్రభుత్వం ఏర్పడ్డాక తూర్పు నియోజకవర్గంలో అధికారి పార్టీవారు ప్రలోభాలు, బుజ్జగింపులతో తెదేపా నుంచి చాలామంది నేతల్ని తమ పార్టీలోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా రెండోశ్రేణి నేతలున్నారు. అయినప్పటికీ పోటీగట్టి ఇచ్చేందుకు తెదేపా సన్నద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడా బలం కోల్పోకుండా వార్డుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇరుపార్టీల మధ్య కనీసం 5వార్డుల్లో పోటాపోటీ నడుస్తున్నట్లు స్పష్టత వస్తోంది. జనసేన ప్రభావం కనిపించడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
విశాఖ దక్షిణం అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,24,493... తెదేపా - 52,172, వైకాపా - 48,443, జనసేన - 18,119
అంతా అయోమయం..
తెదేపా నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్‌కుమార్ ఇప్పుడు వైకాపాకు మద్దతిస్తున్నారు. కొంత తెదేపా కేడర్ అతనివైపు వెళ్లగా, మరికొంత నిలకడగానే ఉంది. దీంతో తెదేపాలో నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రభావంతో కొంత కేడర్ సడలొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైకాపాలో కూడా వర్గపోరు నడుస్తుండటంతో రెబల్స్ బెడద పెరిగే అవకాశముంది. ఎమ్మెల్యే వర్గీయులు పోటీలో ఉంటామని చెబుతుండటంతో వైకాపా నుంచి నామినేషన్లు వేసినవారిలో గందరగోళం చోటుచేసుకుంటోంది. దీంతో పార్టీలోనే వర్గపోరు తీవ్రమైంది.
విశాఖ ఉత్తరం అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,75,430... తెదేపా - 67,352, వైకాపా - 65,408, జనసేన - 19,139, భాజపా - 18,790
అయినా సరే.. పోటీ !..
ఉత్తర నియోజకవర్గంలో తెదేపాకు మంచి కేడర్ ఉన్నప్పటికీ గంటా రాజీనామా ప్రయత్నంతో పార్టీలో కాస్త గందరగోళం నెలకొంది. ఉన్నంతలో అభ్యర్థులు ఆయా వార్డుల్లో బలపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైకాపా వేగంగా కేడర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. వీరి ధాటిని తట్టుకుని పోటీనిచ్చేలా తెదేపా అభ్యర్థుల్ని సంసిద్ధం చేసుకుంటోంది. మధ్యలో స్టీల్‌ప్లాంట్ ఉద్యమం రావడంతో భాజపా, జనసేనపై ప్రభావం పడుతున్నట్లు కనిపిస్తోంది.
విశాఖ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,33,257... తెదేపా - 68,699, వైకాపా - 49,718,
పైచేయి కోసం..
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో తెదేపా బలం బాగా ఉన్నప్పటికీ ఇప్పుడు వారికి ధీటుగా వైకాపా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేడర్‌లో నూతనుత్తేజం కనిపిస్తోంది. అయితే వార్డుల్లో ఇరుపార్టీల నుంచి ప్రలోభాలు నడుస్తున్నప్పటికీ రెండు పార్టీలూ జీవీఎంసీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడే అవకాశం కనిపిస్తోంది.
గాజువాక అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,97,520... వైకాపా - 75,292, జనసేన - 58,539, తెదేపా - 56,642
ఇంటిపోరే సమస్య..
గాజువాకలో అధికారపార్టీ చాలా బలంగా తయారైంది. మునుపు తెదేపా కాస్త వెనకంజ వేసినప్పటికీ.. ఈ నియోజకవర్గంలోనే ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమంతో కేడర్‌లో ఉత్సాహం వచ్చింది. ఈ ఉద్యమంలో ఇరుపార్టీలవారూ పోటాపోటీగా పాల్గొంటున్నాయి. దీంతో ఇరుపార్టీలూ గ్రేటర్ పోరులోనూ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇరుపార్టీల్లో రెబెల్స్ బెడద ఎక్కువైంది. వెనక్కు తగ్గే అవకాశం కనిపించకపోవడంతో పార్టీ బాధ్యులు తలలు పట్టుకుంటున్నారు. భాజపా, జనసేన ప్రభావం చూపడంలేదు.
అనకాపల్లి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,56,691... వైకాపా - 73,207, తెదేపా - 65,038, జనసేన - 11,988
బలాల మధ్య పోరు..
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెదేపా, వైకాపా మధ్య హోరాహోరీ పోరే నడిచింది. చివరి వరకూ ఉత్కంఠే ఉన్నింది. ఇప్పుడు జీవీఎంసీ పరిధిలోకొచ్చిన మున్సిపాలిటీ, విలీన గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 5 వార్డుల్లో గెలుపెవరిదనేది దోబూచులాడుతోంది. ఇరుపార్టీలూ తమ కేడర్‌తో బలంగానే ప్రజల్లోకి దూసుకెళ్లి గెలుపువైపు కృషి చేస్తున్నారు.
పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి..
మొత్తం చెల్లుబాటు ఓట్లు - 1,96,634... వైకాపా - 99,759, తెదేపా - 70,899, జనసేన - 19,626
ఉత్కంఠ తప్పదు..
పెందుర్తి నియోజకవర్గంలోని పార్టీల్లో భారీ మార్పులేమీ జరగలేదు. అయితే గతంతో పోల్చుకుంటే వైసీపీ బలపడింది. ఆ పార్టీశ్రేణులు ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. మరోవైపు తెదేపా తమకున్న కేడర్‌ను చెక్కు చెదరకుండా ఉంచారు. అయితే ప్రజల్లోకెళ్లడంలో కాస్త స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కొంతమంది వైకాపావైపు వెళ్లినా.. అది ప్రభావం చూపడంలేదనే అభిప్రాయముంది. జీవీఎంసీ పరిధిలోని వార్డుల్లో హోరాహోరీ తప్పదన్నట్లుగా ఉంది. ఆయావార్డులోల గెలుపు దోబూచులాడొచ్చు.
ఇవీ చూడండి...