భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నవంబర్ 3న చలో విశాఖ కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ మేరకు జనసేన నేతలు ఈ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో... పార్టీ అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ చలో విశాఖ పోస్టర్ ఆవిష్కరించారు. గతంలో తెదేపా ఇసుక మాఫియా చేసిందని... అదే బాటలో వైకాపా ప్రభుత్వం నడుస్తోందని ఆయన విమర్శించారు.
విశాఖ జిల్లాలో...
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో జనసేన శ్రేణులు రాస్తారోకో చేశారు. నవంబర్ 3న విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీకి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు కోరారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న లాంగ్ మార్చ్‌కు సంబంధించిన గోడ పత్రిక పార్టీ నేతలు విడుదల చేశారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు పార్టీ కార్యాలయంలో చలో విశాఖ పోస్టర్‌ను శ్రీనివాస్‌యాదవ్ ఆవిష్కరించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడం బాధాకరమన్నారు.
కృష్ణా జిల్లాలో...
భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా... జనసేన పార్టీ తలపెట్టిన చలో విశాఖ గోడ పత్రికను... కృష్ణా జిల్లా మైలవరంలో జనసేన అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్రావు ఆవిష్కరించారు.
ఇదీ చూడండి... ఇసుక అమ్ముతోంది ఏపీ... తింటోంది వైసీపీ