పోలవరం నిర్మాణానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిన మాట వాస్తవమేనని.. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందని మంత్రి వివరించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.13 వేల కోట్ల పైచిలుకు నిధులను చెల్లించామని తెలిపారు. జలజీవన్ మిషన్‌కు రూ.60 వేల కోట్లు కేటాయించామని ప్రహ్లాద్ సింగ్ వెల్లడించారు. జలజీవన్ మిషన్‌లో కేంద్ర వాటా 60, రాష్ట్ర వాటా 40 శాతంగా ఉంటుందన్నారు. ఏపీలో 95 లక్షల ఇళ్లకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 54 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి.. 2024 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు.
"పోలవరం 2013-14 అంచనాలకు అంగీకరించాం. ఇప్పుడు పోలవరం అంచనా వ్యయం పెరిగింది. పెరిగిన అంచనాలపై కమిటీ అధ్యయనం చేస్తోంది. కమిటీ నివేదిక ఇచ్చాక నిర్ణయం తీసుకుంటాం. పోలవరానికి కేంద్రం ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ఇచ్చింది. పోలవరం పూర్తికి అన్ని రకాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధం. మెగా ఫుడ్‌పార్క్ స్థానంలో మినీ ఫుడ్‌పార్క్ తీసుకొస్తున్నాం. యూనిట్‌కు రూ.10 లక్షల రుణం ఇచ్చి 35 శాతం రాయితీ ఇస్తాం."- ప్రహ్లాద్ సింగ్, కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి
అంతకుముందు గాజువాక ఆటోనగర్ బయోఫేక్ట్ రీసెర్చ్ సెంటర్‌ను కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ ప్రారంభించారు. రీసెర్చ్ సెంటర్లో ఆహార పదార్థాలు, మంచినీరు, ఫార్మా ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పరిశోధన చేయటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం ప్రతినిధులతో పాటు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మంత్రి పదవి రాలేదు.. నా హింసావాదమేంటో చూపిస్తా : వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు