విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ కిట్లు లేవని ఆరోపణలు చేసిన డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసి సమస్య చెప్పిన వైద్యుడిపై చర్యలు తీసుకోవడాన్ని ఖండించారు. ఎన్-95 మాస్క్ కావాలని కోరితే వైద్యుడిని సస్పెండ్ చేయడం షాక్‌కి గురిచేసిందని ఆక్షేపించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారి పట్ల జగన్ ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తే... ఇక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రిస్క్ చేస్తున్న వారిని ఎలా ముందుకు నడిపిస్తారని నిలదీశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ ఇవ్వటంతో అండగా నిలవాలని హితవు పలికారు. వైద్యులకు రక్షణ సామగ్రి ఇవ్వడంటూ ఓ జూనియర్ డాక్టర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ జూనియర్ డాక్టర్ని కూడా సస్పెండ్ చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు. వైద్యుల పట్లే సీఎం ఇంత కఠినoగా ఉంటే ఇక కరోనాపై పోరాటం ఎలా సాగుతుందని ప్రశ్నించారు.
వైద్యుడు సస్పెన్షన్‌ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఒక దళిత వైద్యుడిపై ముఖ్యమంత్రి జగన్ తన ప్రతాపం చూపించటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల దగ్గర ఉండాల్సిన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొట్టేసి మీడియాకి ఫోజులు ఇస్తున్న వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేను ఏం చెయ్యాలని ప్రశ్నించారు. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికలే ముఖ్యం అని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్‌కు ఏం శిక్ష వెయ్యాలని లోకేశ్ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం: నర్సీపట్నం వైద్యుడిపై సస్పెన్షన్ వేటు