విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తువైద్య నిపుణులు డాక్టర్ కె.సుధాకర్ వ్యవహారంలో చోటు చేసుకున్న ఘటనపై అభియోగపత్రాన్ని సంబంధిత న్యాయస్థానంలో వేసేందుకు సీబీఐకి హైకోర్టు అనుమతించింది. మరోవైపు ఈఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని సీబీఐ చెబుతున్న నేపథ్యంలో .. వారిపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే వెసులుబాటు సీబీఐకి ఇచ్చింది. ఐదుగురి ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీబీఐ సిఫారసు చేస్తామన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. సీబీఐ కోరిన అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతిచ్చే వ్యవహారం, ప్రభుత్వం ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకుందో తదుపరి విచారణలో పరిశీలిస్తామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. డాక్టర్ కె.సుధాకర్ తో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్ ను జతచేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్ గా పరిగణించి విచారణ జరిపి సీబీఐ దర్యాప్తునకు గతంలోనే ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణలో దర్యాప్తు పూర్తి చేసినట్లు సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు తెలిపారు. తుది స్థాయి నివేదికను కోర్టు ముందు ఉంచామన్నారు. అభియోగపత్రం దాఖలు చేసేందుకు అనుమతించాలన్నారు . మొత్తం ఆరుగురిలో ఐదుగురి ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలిపారు. వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంచి ... శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామన్నారు.
ఆరుగురిలో ఒకరు డాక్టర్ సుధాకర్ కన్నుమూశారని తెలిపారు. అమికస్ క్యూరి, సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ పేర్కొన్న మొత్తం ఆరుగురిలో ఒకరు డాక్టర్ సుధాకర్ కన్ను మూశారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. కన్ను మూసిన డాక్టర్ సుధాకర్ విషయంలో విచారణ ప్రశ్న ఉత్పన్నం కాదంది. మిగిలిన అధికారుల విషయంలో అభియోగపత్రం దాఖలు చేసేందుకు సీబీఐకి వీలుకల్పించింది .
ఇదీ చదవండి
Pawan Fires on YCP: వైకాపాపై పవన్ ఫైర్.. కోడికత్తి మూకలకు భయపడనంటూ వార్నింగ్