విశాఖ వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఆయన్ను కేజీహెచ్‌కు తీసుకొచ్చాక అక్కడ్నుంచి మానసిక వైద్యశాలకు ఎందుకు పంపించాల్సి వచ్చిందనే కోణంలో గత 2 రోజులుగా సీబీఐ అధికారులు అనేక విషయాలు తెలుసుకున్నారు. కేజీహెచ్ వైద్యులు, హౌస్ సర్జన్లను విచారించడమే కాక అక్కడి సీసీటీవీ ఫుటేజీ సైతం పరిశీలించారు. గత నెల 16న విశాఖ పోర్టు ఆసుపత్రి వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలను సీబీఐ బృందం పరిశీలించినట్టు తెలుస్తోంది.
డాక్టర్ సుధాకర్‌ను కొట్టారన్న ఆరోపణలతో ఇప్పటికే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా.... మిగతా సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం... సుధాకర్‌ను నిలువరించడం చాలా కష్టమైందని.... తమ తప్పేమీ లేదని... ఆయన ఆత్మహత్యకు సైతం యత్నించినట్టు చెబుతున్నారు. ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లకుండా చూసేందుకు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందంటున్నారు.
సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన వీడియోలనే.... ఘటనకు సంబంధించిన ఆధారాలుగా ఇప్పటిదాకా పోలీసులు చూపిస్తున్నారు. పోర్టు ఆసుపత్రి కూడలిలో ఉన్న సీసీ కెమెరాల నుంచి సైతం ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఒక కెమెరా పనిచేయట్లేదని... మరొకటి వేరే దిక్కులో ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా... సీబీఐ విచారణ సమయంలో పోలీసులు చెప్పే వివరాలు కీలకంగా మారనున్నాయి.