విశాఖ జిల్లాలో శారద, వరాహ, పెద్దేరు, సర్ప నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తుంటాయి. ఈ నదుల్ని దాటేందుకు పరివాహక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులపై వంతెనల నిర్మాణాలకు ఐదారేళ్ల క్రితమే నిధులు మంజూరైనా.. ఇంకా చాలాచోట్ల పనులు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. దేవరాపల్లి మండలం పినకోట, కలిగొట్ల వద్ద శారద నదిపై వారధులు నిర్మిస్తున్నారు. చోడవరం మండలం గవరపాళెంతోపాటు కోటవురట్ల మండలం జల్లూరు, పొందూరు వద్ద వరాహ నదిపై వంతెనల నిర్మాణం జరుగుతోంది. గతేడాదే ఇవన్నీ పూర్తికావాల్సి ఉన్నా.. రెండుచోట్ల ఇంకా పునాదుల దశ దాటలేదు. మరో రెండు చోట్ల వంతెన పని పూర్తయినా.. అప్రోచ్ రోడ్డు నిర్మాణాలకు భూసమస్య తలెత్తి వినియోగంలోకి రాలేదు.
నదులపై వంతెనలు పూర్తికాకపోవడం వల్ల కిలోమీటర్ దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని చేరుకునేందుకు... 15 నుంచి 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక కాజ్‌వేలు కొట్టుకుపోయినా పునరుద్ధరించలేదు. చోడవరం మండలం గవరవరంలో కోతకు గురైన కాజ్‌వేలపై... కర్రలు, చెక్కలు వేసి ప్రమాదకరంగా నదిని దాటుతున్నారు.
రహదారులు -భవనాలశాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ నిధులతో ఈ వంతెనలు నిర్మిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల... నిధుల్లో కొంత మేర ఆగిపోయాయి. మళ్లీ ప్రతిపాదనలు పంపి ఒప్పంద కాలాన్ని పొడిగించి.. ఇటీవల ఒక వంతెన పని మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తామన్న మాటలతో సరిపెట్టకుండా... చేతల్లో చూపించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: చర్చల పునరుద్ధరణపై నేడు రైతు సంఘాల కీలక భేటీ