PM Modi Visakha tour Schedule: భాజపా రాష్ట్ర అధ్యక్షడు సోము వీర్రాజు ప్రధాని మోదీ పర్యటనపై వివరాలు వెల్లడించారు. ప్రధాని మోదీ ఈనెల 11 సాయంత్రం 6:25కు విశాఖ వస్తారని పార్టీ తరఫున ఘన స్వాగతం పలికి, అనంతరం రోడ్ షో నిర్వహిస్తామన్నారు. ఈ సాయంత్రానికి ప్రధాని రోడ్ షో మార్గం నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్ఏడీ కూడలి నుంచి పాత ఐటీఐ మార్గంలోగానీ లేదా బీచ్ రోడ్లో ఏర్పాటు చేస్తామన్నారు. 12న ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్లో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 12న మధ్యాహ్నం 12.15కు ప్రధాని తిరిగి బయలుదేరి వెళతారని చెప్పారు. కేంద్రం ఇంతకాలం ఎన్నో పథకాలకు నిధులు ఇవ్వడంతో అనేక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అన్నారు. వాటిని ప్రధాని దేశానికి అంకితం చేస్తారని చెప్పారు.
రాష్ట్ర పరంగా ఏ అభివృద్ధి లేదనేది స్పష్టమని సోము వీర్రాజు అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విపక్షాల మీద అణచివేత చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. భాజపా ఏపీలో 5వేల ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కడప జిల్లాలో బలహీనవర్గాలవారు అభియాన్‌కు తరలివస్తే అధికార పార్టీ అడ్డుకుంటోంది. దీనిపై తాము పోరాడుతామన్నారు. అమరావతిపై సోము వీరాజు స్పందిస్తూ రాజధాని అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిపై వైఖరిని స్పష్టంగా చెప్పామన్నారు. ప్రతిపక్షంలో అమరావతికి మద్ధతు ఇచ్చి మూడు రాజధానులు అంటున్న జగన్‌ను ప్రశ్నించాలని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను విశాఖ సభలకు పిలుస్తారా అంటే సోము వీర్రాజు సమాధానం చెప్పలేదు.
ఇవీ చదవండి: