BJP Leaders Hot Comments on YCP Leaders: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నియామకంపై రాష్ట్ర బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. టీటీడీ ట్రస్టు బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆగ్రహించారు. హిందూమతంపై విశ్వాసం లేనివారికి పాలకమండలిలో చోటు కల్పించారని దుయ్యబట్టారు. తిరుమల పవిత్రతకు జగన్ ప్రభుత్వం భంగపరిచేలా నిర్ణయాలు తీసుకుంటుందని.. టీటీడీ నియామకాల విషయంలో ఎందుకు పీఠాధిపతులను సంప్రదించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు టీటీడీ బోర్డులో అన్యమతస్థులు, లిక్కర్ మాఫియాకు చెందినవారి నియామకాలను నిరసిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ చేపట్టిన 'సంతకాల కార్యక్రమం'లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Vishnu Kumar Raju Comments: విడతల వారీగా ఎన్నికలు వద్దు - ఒకేరోజు ఎన్నికలు ముద్దు.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను విడతల వారీగా కాకుండా.. ఒకేరోజు నిర్వహించాలని.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరారు. విశాఖలో అధికార పార్టీ నేతలు భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారని దుయ్యబట్టారు. 66 పోలింగ్ బూత్‌లలో 15,516 దొంగ ఓట్లు ఉన్నాయని విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. విజయనగరం, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ నేతలు భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటానికి రజత్ భార్గవ్ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయని విష్ణుకుమార్ విమర్శించారు.
టీటీడీ ట్రస్టు బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. హిందూ మతంపై విశ్వాసం లేనివారికి పాలకమండలిలో చోటు కల్పించారు. జగన్.. ఒక ట్రస్టు పెట్టుకుని మీకు నచ్చిన వారిని నియమించుకోండి. వైసీపీ నేతలకు దోపిడీ జన్మహక్కుగా మారింది. బస్ బేకి టెండర్లు ఎప్పుడు పిలిచారో జీవీఎంసీ కమిషనర్ చెప్పాలి. కమీషన్లకు కక్కుర్తిపడి ఇలాంటి నిర్మాణాలు చేశారు. జగన్ మెప్పు కోసం త్వరగా కట్టాలని నాణ్యత లేని బస్ బేలు కట్టారు. రజత భార్గవ్‌ను వెంటనే ఇంటికి పంపించాలి. ఆ ఐఏఎస్ అధికారిపై జగన్ విచారణ జరిపించాలి. ఈ అధికారి వెనుక అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారేమో..! అని ప్రజలు అనుకుంటున్నారు.- విష్ణు కుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
BJP MP GVL Narasimha Rao comments: వైసీపీకి తితిదే పట్ల ఎందుకింత నిర్లక్ష్యం.. టీటీడీ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిసారి ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తుందని.. బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మన దేవాలయం- మన హక్కు' పేరిట జీవిఎల్ నరసింహరావు విశాఖలోని పెదవాల్తేర్ కరకచెట్టు పోలమాంబ ఆలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ''తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పవిత్ర ఆరాధ్య పుణ్యక్షేత్రం. అలాంటి టీటీడీ పాలక మండలి నియామకంలో తీవ్రమైన తప్పులు జరగడం ఇది మొదటిసారి కాదు. కానీ, జగన్ ప్రభుత్వం ప్రతిసారి టీటీడీ విషయంలో ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూనే ఉంది. ఎమ్మెల్యే టికెట్లకు అన్ని రకాలుగా పరీక్షించే మీరు.. టీటీడీ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం. తిరుమల పవిత్రతను భంగపరిచేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది'' అని ఆయన మండిపడ్డారు.
BJP leaders challenge the government: హిందూ దేవాలయాల జోలికి వస్తే ఊరుకోం.. మరోవైపు బీజేపీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో చేపట్టిన సంతకాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువత పాల్గొన్నారు. టీటీడీలో దొంగలు పడ్డారంటూ ప్రజలు, బీజేపీ నేతలు నినాదాలు చేశారు. పవిత్ర హైందవ దేవాలయాల్లో అన్య మతస్థులకు ప్రభుత్వం చోటు కల్పించడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ తరఫున కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిమన్నా బీజేపీ నేతలు.. మరోసారి హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేసినా.. హిందూ దేవాలయాల జోలికి వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
TTD : తితిదే పాలకమండలి సభ్యుల నియామకంపై నేడు హైకోర్టు విచారణ