ద్విచక్ర వాహనాన్ని వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడిపోయాడు. అటుగా వస్తున్న లారీ ఆయనపై నుంచి వెళ్లిపోయింది. అంతే అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా మునగపాక మండలం గంగాదేవిపేటలో జరిగిన ఈ ప్రమాదం ఓ కొత్త జంటను విడదీసింది. వారి కలను చెరిపేసింది.
అనకాపల్లి గాంధీ నగర్‌కు చెందిన కౌండిన్య.. అచ్యుతాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నారు. ఆయనకు నెల క్రితం వివాహమైంది. రోజూ మాదిరిగానే అచ్యుతాపురంలో ఆలయం పని పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా ఘోరం జరిగిపోయింది. బైకు వస్తున్న అతన్ని వెనకవైపు వేగంగా దూసుకొచ్చిన వ్యాను ఢీ కొట్టగా.. కౌండిన్య అక్కడికక్కడే చనిపోయాడు.
వివాహమైన నెల రోజుల్లోనే భర్త రోడ్డు ప్రమాదానికి బలవ్వడంతో లావణ్య ఒక్కసారిగా హతాశురాలైంది. ఆమె రోదనలు చూసిన వాళ్ల కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: