విశాఖ జిల్లాలో 18 నెలల చిన్నారి అదృశ్యం ఘటన విషాదాంతమైంది. పాప మృతదేహాన్ని పెందుర్తి కొండ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... విశాఖ జిల్లా పెందుర్తి మండలం పులగానిపాలెం గ్రామానికి చెందిన కుసుమలత ఇంట్లో జరిగిన గొడవతో మనస్థాపం చెంది తన కూతురితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది.
తల్లీబిడ్డలు కనబడటంలేదని ఈనెల 6న పెందుర్తి పోలీస్స్టేషన్లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా 10న మధ్యాహ్నం 12:30 సమయంలో చిన్నముషిడివాడ కాలనీ కొండలమీద నుంచి దిగుతూ ఒక మహిళ కనిపించిందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ కుసుమలతను చూసి విచారించారు. అప్పుడు కుసుమలత చెప్పిన విషయం విని పోలీసులు షాకయ్యారు. తన కూతురు చనిపోయిందని... కొండ ప్రాంతంలో పాతి పెట్టానని చెప్పింది.
ఆ పాప ఆచూకీ కోసం రెండు రోజులుగా పోలీసులు జాగిలాలతో అన్వేషించిన ఫలితం లేకుండా పోయింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు బుధవారం ఉదయం చిన్నారిని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని కనిపెట్టారు. అనంతరం పాప మృతదేహాన్ని బయటకు తీశారు. మహిళ మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.