రాజధాని అంశంపై విశాఖ లోక్సభ స్థానానికి ఉపఎన్నిక పెట్టి తేల్చుకునేందుకు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సిద్ధమా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. విశాఖ లోక్సభ స్థానానికి ఉపఎన్నికకు వెళ్తే ప్రజల ఉద్దేశమేమిటో తెలిసిపోతుందని అన్నారు. ఉక్కు నగర ప్రజలు రాజధానిని కోరుకోవట్లేదన్న అయ్యన్న... ఇప్పటికే వైకాపా రౌడీయింజం, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దందాలతో వారు బెంబేలెత్తిపోయారని మండిపడ్డారు.
పత్రికలు రాయటానికి కూడా సిగ్గుపడేలా ఉపముఖ్యమంత్రి ధర్మాన అసహ్యంగా మాట్లాడారని అయ్యన్న ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ బూతుల సంస్కృతి ఎప్పుడూ లేదని గుర్తు చేశారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని చంద్రబాబు సవాల్ చేస్తే... సీఎం జగన్ పారిపోయారని విమర్శించారు. రౌడీలు విశాఖ భూములు ఆక్రమించుకుంటుంటే రాని ఆవేదన... చంద్రబాబును తిట్టడానికే ఎందుకు వచ్చిందో ధర్మాన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతులు తిట్టడమే పనా అని ఆక్షేపించారు. వైకాపా నేతల బూతులు వినలేక మహిళలు టీవీలు కట్టేస్తున్నారని అయ్యన్న దుయ్యబట్టారు.
ఇదీ చదవండి