ప్రాజెక్టు పేరు - ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్
ఖర్చుపెట్టిన మొత్తం - సుమారు రూ.2కోట్లు
నెలకు కోచ్‌లు కడిగే సామర్థ్యం - 8వేలు
ఒక్కో రైలును కడగటానికి పట్టే సమయం - 7 నుంచి 10నిమిషాలు
సెన్సార్ రైలు ఇంజన్‌లో ఉన్న లోహాన్ని ప్రభావమంతంగా పసిగడుతుంది. ప్లాంట్‌కు కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఈ సెన్సార్.. రైలు రాగానే పసిగట్టడంతో ప్లాంట్‌లోని ఇతర మోటార్లు, బ్రష్‌లు, స్ప్రింక్లర్ యంత్రాలన్నీ ఆటోమేటిక్‌గా ఒక్కసారిగా ఆన్ అయిపోతాయి. రైలుపైకప్పును కడిగేలా పట్టాలకు రెండువైపులా పలు స్ప్రింక్లర్‌లు ఉంటాయి. ఇవి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అతివేగంగా కొట్టి మురికిని తొలగిస్తాయి.
కోచ్‌లను ఇరువైపులా శుభ్రపరచడానికి నీలిరంగులో నిటారుగా ఉన్న బ్రష్‌లు వేగంగా పనిచేస్తాయి. పట్టాలకు రెండువైపులా 10 బ్రష్‌లుంటాయి. ఒక్కో బ్రష్‌కు ఒక్కో మోటర్ ఉంటుంది. ఈ బ్రష్‌లకు అనుబంధంగా స్ప్రింక్లర్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని అందిస్తాయి. పైగా సబ్బు, ఇతర పదార్థాల్ని కలపడంతో కోచ్‌లబయట వైరస్, బ్యాక్టీరియాల్ని నియంత్రించేలా చేస్తుంది.
గుండ్రంగా ఉన్న బ్రష్‌లను డిస్క్ బ్రష్‌లని అంటారు. నిటారు బ్రష్‌లు శుభ్రపరచగా ఇంకా ఎక్కడైనా బ్యాక్టీరియా, వైరస్, ఇతర మురికి ఉన్నా పోయేలా చేస్తాయి. ప్రధానంగా కిటీకలు, తలుపులు, ప్రయాణికులు పట్టుకునే గ్రిల్స్ తదితరాల్ని కడిగేస్తాయి. ఇలాంటివి పట్టాలకు రెండువైపులా 10 ఉంటాయి. ప్రయాణికులు ఎక్కే మెట్లభాగం, అలాగే కోచ్ దిగువన ఉన్నభాగాన్ని బ్రష్ శుభ్రపరుస్తుంది. ఇలాంటివి ఇరువైపులా రెండుంటాయి.
ప్లాంట్‌కు సమీపంలోనే పట్టాలకు రెండువైపులా పెద్దబ్లోయర్లను ఉంచారు. వీటిలోని సన్నని చీలికద్వారా.. శుభ్రమైవచ్చిన కోచ్‌లపై గాలుల్ని వదులుతారు. తడి ఆరిపోయేలా చేస్తారు. ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను ఈ ఏడాది కొవిడ్ నేపథ్యంలో అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో రైళ్లను అపేయడంతో ప్లాంట్‌తో పనిలేకుండా పోయింది. ఇప్పుడు పండుగ సమయంలో రైళ్లు పెరగడంతో రోజుకు 5 నుంచి 10 రైళ్ల వరకు శుభ్రపరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచే అవకాశముంది.
ఉపయోగాలివే..
- పర్యావరణహితంగా ఈ ప్లాంట్‌ని రూపొందించారు. కోచ్‌ల్ని శుభ్రపరిచేందుకు ఆర్‌వో నీటిని వాడుతున్నారు. సాధారణంగా ఒక కోచ్‌ను కడగటానికి 850లీటర్ల నీటిని వినియోగిస్తారు. ఇప్పుడు ప్లాంట్‌ద్వారా కేవలం 400లీటర్లవరకే ఖర్చవుతోంది. రోజుకు 52శాతం నీరు ఆదా అవుతోంది.
- సాధారణంగా ఒక పూర్తి రైలును(24కోచ్‌లు) శుభ్రపరచడానికి కనీసం 5మంది కార్మికులు 5గంటలు శ్రమించాల్సివచ్చేది. ఇందులో 90శాతం పనిని కేవలం 10 నిమిషాల్లోపే యంత్రాలు చేసేస్తున్నాయి. మిగిలిన 10శాతం పనిని కోచ్ లోపల కార్మికులే చేస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్ నిర్వాహణకు ఒక్క వ్యక్తే సరిపోతున్నారు.
- కోచ్‌ల్ని కడగ్గా వచ్చిన వ్యర్థ జలాల్ని ఇక్కడే శుద్ధిచేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్లాంట్‌కు స్పీడ్ సెన్సార్లను, వాటర్ మీటర్లనూ అనుసంధానించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ తరహా ప్లాంటులు దేశంలో 40 దాకా ఉండగా.. భువనేశ్వర్, పూరిలో రూ.4కోట్లతో రెండు ప్లాంట్లు నిర్మాణమవుతున్నాయి.
ఇదీ చదవండి: 'మలబార్-2020' విన్యాసాలకు ముహూర్తం ఖరారు