విశాఖ జిల్లా భీమునిపట్నంలో శివకేశవస్వామి దేవస్థానానికి చెందిన గొల్లకుమ్మరిపాలెంలో సర్వే నంబరు 62/3లోని 2.21 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.6 కోట్ల విలువైన ఈ భూమిని... గుర్తు తెలియని వ్యక్తులు చదును చేసేందుకు ప్రయత్నించారు. విశాఖ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి అప్రమత్తమై...రెవెన్యూ అధికారుల సాయంతో భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న పాకలను తొలగించి... హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఉద్రిక్తతల నడుమ
ఆక్రమణల తొలగింపు కోసం ముందుగా పోలీసులను బందోబస్తు కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... రెవెన్యూ సిబ్బంది సాయంతో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లారు. ఓ దశలో ఆక్రమణదారులు ఆర్తనాదాలతో అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు సిబ్బందిని చుట్టుముట్టారు. మహిళలు ప్రొక్లెయినర్‌కు అడ్డుపడ్డారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు సహాయం కోరినా.. పోలీసులు సకాలంలో స్పందించలేదని అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కబ్జా వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తేలుస్తామన్నారు.
చివరకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణదారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.