ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఆశా వర్కర్లు విశాఖలో ఆందోళన చేపట్టారు. పది వేల రూపాయలు గౌరవ వేతనం ప్రకటించిన వైకాపా ప్రభుత్వం... ఒకేసారి చెల్లించకుండా విడతల వారీగా చెల్లించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10వేల జీతానికే తమకు సంక్షేమ పథకాలు దూరం చేశారని వాపోయారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ఆశా కార్యకర్తలను పర్మినెంట్ ..చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన..
నల్ల చట్టాలతో రైతులకు తీరని అన్యాయం చేస్తోన్న ప్రధాని మోదీ.. అన్నదాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సీపీఐ కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే... ఆందోళనకారులపై లాఠీచార్జీ చేయడాన్ని సీపీఐ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండి: సీహెచ్సీపై రోగి బంధువులు దాడి.. వైద్యసిబ్బంది ఆందోళన