మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే తిరునాళ్లకు విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ పోతురాజు బాబు ఆలయం సిద్ధమవుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు. ఇందుకోసం విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
భక్తులు ఇక్కడి జలాశయంలో పుణ్యస్నానాలు ఆచరించి పోతురాజు బాబు, పెద్దింటమ్మ ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. పెద్దింటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడకు విచ్చేసే భక్తుల స్నానాల కోసం అధికారులు ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేశారు. అలాగే కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పోలీసులు చేపడుతున్నారు.