విద్యుత్తు నిఘా విభాగం అధికారుల నివేదిక.. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లోని అవినీతి అధికారులకు చెమటలు పట్టిస్తోంది. కవర్డ్ కండక్టర్ల(పూత పూసిన విద్యుత్తు తీగలు) కొనుగోలు పేరుతో దాదాపు 131 కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి సమర్పించడం సంచలనాలు స్పష్టిస్తోంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ సీఎండీ దొరతో రాజీనామా చేయించి ప్రభుత్వం నష్టనివారణ చర్యలను చేపట్టింది.
కుంభకోణం చరిత్ర
విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు లేకుండా కవర్డ్ కండక్టర్ల కొనుగోలుకు ప్రభుత్వానికి ఓ మధ్యవర్తి సూచించారు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున ధరపై స్పష్టత ఇవ్వకుండానే 2016లో టెండర్లు పిలిచారు. ఆ దళారి ముందే చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారం... బిడ్ వేసే కంపెనీకి అనుకూలంగా నియమావళి రూపొందించారు. రేచెమ్ ఆర్పీజి,సాయి ఎలక్ట్రికల్ ఎంటర్ ప్రైజెస్తో పాటు మరొక సంస్థ బిడ్లుదాఖలు చేశారు. ఈ రెండు కంపెనీలు ఒకరివేనని విజిలెన్స్ నిర్ధారించింది. టెండరులో ప్రథమ ధరావతు రుసుము నిధులను కూడా ఒకే ఖాతా నుంచి పంపించారు. రేచెమ్ సంస్థకే టెండర్ దక్కింది. ఎలాంటి అనుభవం లేని ఈ సంస్థకు పనులను కట్టబెట్టారు. గ్లోబల్ టెండర్ ప్రకటన ఇవ్వకుండా స్ధానికంగా ప్రకటనలు ఇచ్చి ధరను నిర్ణయించకుండా టెండర్ కట్టబెట్టడంలో ఈ అధికార్లంతా కీలకంగా వ్యవహరించారనేది అభియోగం.
గుజరాత్ నుంచి తెచ్చి.. నిధులు బొక్కి
మొత్తం 3414 కిలో మీటర్ల పొడవైన తీగల్ని సరఫరా చేసిన రేచెమ్ సంస్థ 178 కోట్ల రూపాయల బిల్లులను సమర్పించింది. 59 కోట్ల విలువచేసేతీగలకు 178 కోట్ల రూపాయల బిల్లులను సమర్పించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 119 కోట్లు అదనంగా చెల్లించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఈ వైర్లను గుజరాత్ నుంచి తీసుకువచ్చారని విదేశాల నుంచి తేలేదని నిగ్గు తేల్చారు.
దొరది కీలక పాత్ర
ఎస్పీడీసీఎల్లో పని చేసినప్పుడు దొర ఈ మాదిరిగానే టెండర్లను ఆమోదింపజేసి, ఈపీడీసీఎల్కి సీఎండీగా వచ్చిన తర్వాత అదే పద్దతిలో రేచెమ్ సంస్ధకు దాదాపు 400 కిమీ పొడవునవైర్లువేసేందుకు అనుమతించారు. ఇందులోనూ దాదాపు 12 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని తేలింది. గతేడాది జులైలో విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించగా... దీనిపై అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగింది. అప్పటి నుంచి ఒత్తిళ్లు రాగా.... శుక్రవారం తన పదవికి రాజనామా చేశారు హెచ్.వై. దొర. వెంటనే దానిని ఆమోందించి విచారణ కొనసాగేట్టుగా ప్రభుత్వం ఆదేశించింది.