Visakhapatnam Rushikonda illegal mining updates: విశాఖపట్టణంలోని రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ గతంలో జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణలు.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం వాయిదాలు వేసింది. ఈ క్రమంలో నేడు మరోసారి రుషికొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాల పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణలో భాగంగా వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రుషికొండ తవ్వకాలపై ప్రజాహిత వ్యాజ్యాలు.. విశాఖపట్టణం జిల్లా యండాడ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 19లో.. రుషికొండను పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్ (టూరిజం రిసార్టు) పేరుతో ఇష్టారీతిగా తవ్వేస్తూ, నిబంధనలకు మించి నిర్మాణాలను చేపడుతున్నారని.. విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన పార్టీ కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి యాదవ్‌లు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. వీరితోపాటు ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం ఆ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలాలు చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)కు విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నిబంధనలు తుంగలో తొక్కి పరిధికి మించి తవ్వకాలను జరుపుతున్నారని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు.
కేంద్ర కమిటీ ఏర్పాటు.. ఈ నేపథ్యంలో ఆ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం రుషికొండను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. పూర్తి వివరాలతో కూడిన నివేదికను న్యాయస్థానంలో సమర్పించాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిటీలో సభ్యులుగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్త డాక్టర్ వీవీఎస్ఎస్ శర్మను, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త డి.సౌమ్యను, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైయినయిల్ కోస్టల్ మేనేజ్మెంట్ శాస్త్రవేత్త డాక్టర్ మానిక్ మహాపాత్రను, కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యనిర్వహణ ఇంజినీర్ నాయక్, కేంద్ర పర్యావరణ అటవీశాఖ శాస్త్రవేత్త డా.సురేష్ బాబును న్యాయస్థానం నియమించింది. దీంతో ఆ కమిటీ మార్చి 13వ తేదీ నుంచి 15 తేదీ వరకు విశాఖపట్టణంలో ఉన్న రిషికొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాలపై, భవన నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి.. రిపోర్టును ఏప్రిల్ 13వ తేదీన హైకోర్టులో సమర్పించింది.
రుషికొండపై తవ్వకాలు నిజమే..!.. కేంద్ర కమిటీ సమర్పించిన ఆ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. విశాఖలోని రుషికొండపై తవ్వకాలు, భవన నిర్మాణాలకు సంబంధించి.. ఉల్లంఘనలు జరిగాయని కమిటీ తెలిపింది. అంతేకాకుండా, ఎంవోఈఎఫ్ (కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ) నుంచి తెచ్చుకున్న అనుమతులకు వ్యతిరేకంగా రిషికొండపై భవన నిర్మాణాలను చేపట్టారని ఆ నివేదిలో వెల్లడించింది. భూమి వినియోగ విధానం, నిర్మాణ బ్లాకుల సంఖ్య, ప్రతి బ్లాక్ బిల్టప్ ప్రాంతం (నిర్మాణ విస్తీర్ణం)లో మార్పులు చేశారని కమిటీ తేల్చి చెప్పింది.
ఇవీ చదవండి