Andhra Medical College Centenary Celebrations : కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌ను రూ.23.75 కోట్లతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వర్చ్యువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. శుక్రవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో కేంద్రమంత్రి దిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. మూడు రోజుల పాడు జరిగే శతాబ్ది వేడుకలకు దేశ, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు.
AMC Centenary Celebrations : ఈ సందర్భంగా వర్చువల్‌గా మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పోర్ట్ సిటీగా విశాఖకి ఎంతో పేరుందన్నారు. దేశంలోనే పురాతన వైద్యకళాశాల విశాఖకు ఉండటం ఎంతో గర్వకారణమని వెల్లడించారు.
Mansukh Mandaviya Comments on Health Care Sector : ఆంధ్ర వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని మన్సుక్ మాండవియ అన్నారు. సూపర్ స్పెషాలిటి సేవలన్నీ ఒకేచోట లభించడం మంచి పరిణామని, రోగులు వైద్యుల నిష్పత్తిలో అంతరం లేకుండా వుండాలని తెలిపారు. మెడికల్ ఎకో సిస్టమ్ తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందన్నారు. హెల్త్ కేర్ రంగంలో తొమ్మిదేళ్లలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో సేవాభావం అవసరమన్నారు. వైద్యరంగంలో సేవాభావంతో పని చేయాలని మన్‌సుఖ్ మాండవీయ అన్నారు.
Vidadala Rajini in AMC Centenary Celebrations : రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1923లో కళాశాల ప్రారంభమైనదని, మొట్టమొదటి సారిగా ఆంధ్రా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వారి సేవలు వివిధ రంగాల్లో అందిస్తున్నట్లు వివరించారు.
Vidadala Rajini Comments on Health Care Sector : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నూతనంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు విడదల రజని తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవలకు వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.
కేజీహెచ్ అభివృద్ధికి 600 కోట్ల : వైద్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షి ద్వారా ప్రజల ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 600 కోట్ల రూపాయలు కేజీహెచ్ అభివృద్ధికి కేటాయిస్థామన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు కోసం 246 కోట్లు వెచ్చిస్తామన్నారు. వైఎస్సార్ హెల్త్ కేర్ ఫెసిలిటీని విస్తృతంగా తీసుకువస్తున్నామని విడదల రజిని అన్నారు.
రాష్ట్రంలో మెరుగవుతున్న వైద్య సేవలు : "కలెక్టర్ మల్లికార్జునకు హృదయపూర్వక అభినందనలు. స్వతహాగా వైద్యులైన ఆయన కేజీహెచ్‌లో వైద్య సదుపాయాల కోసం సీఎస్‌ఆర్ ద్వారా రూ.16 కోట్ల నిధులు సేకరించారు. ప్రజారోగ్యంపై ఆయన చూపిన శ్రద్ధ ప్రశంసనీయం. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగవుతున్నాయనేందుకు కలెక్టర్ చేపట్టిన చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి."- విడదల రజిని, వైద్యారోగ్య శాఖ మంత్రి
వైద్య విద్యార్థులకు మెడల్స్, మెమోరియల్ అవార్డులు : సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షులు డా. టి. రవి రాజు మాట్లాడుతూ ఆంధ్రా మెడికల్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలోని వివిధ దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించారు. 1923లో కళాశాల ప్రారంభించినట్లు చెప్పారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు వివరించారు. ప్రారంభించినట్లు వివరించారు.
100 Yrs For Andhra Medical College : ముందుగా కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలు గూర్చి తెలియజేశారు. సెంటినరీ సెలబ్రేషన్స్ సావనీర్‌ను విడుదల చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పీజీ, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మెడల్స్, మెమోరియల్ అవార్డులు అందజేశారు.