ఉత్తరాంధ్ర... ఉత్తుత్తి ఆంధ్రాగా కాకుండా ఉత్తమ ఆంధ్రాగా ఎదగాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇక్కడ చంద్రబాబు పర్యటించి ప్రజలు దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేత పర్యటన కేవలం ఆయన అనుయాయుల పెళ్లిళ్లకు హాజరు కావడం కోసమేనని విశాఖలో ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలను అవమానిస్తూ కొన్నాళ్లుగా చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలకు నిన్న జరిగిన సంఘటనే సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబును ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటే.. కొన్ని మీడియా సంస్థలు వైకాపా కార్యకర్తల పనిగా చిత్రీకరిస్తున్నాయని ధ్వజమెత్తారు. అదే అమరావతిలో వైకాపా ప్రజాప్రతినిధులను అడ్డుకుంటే రైతులు ఉద్యమంగా చెప్పడం ఏంటని నిలదీశారు. పులివెందుల నుంచి కొందరు వచ్చి కావాలనే చంద్రబాబును అడ్డుకుంటున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిన్న విశాఖ విమానాశ్రయం నుంచి చంద్రబాబును వెనక్కి పంపించిన ప్రజల మనోవేదనను తెదేపా అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి: