విశాఖపట్నంలో ఓ సంస్థ వ్యవహారం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు పరీక్షగా మారింది. రుషికొండలో 50 ఎకరాల స్థలాన్ని విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 2005లో సమీకృత గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకొని ఆ సంస్థకు అప్పగించింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆ ప్రైవేటు సంస్థ, వీఎంఆర్‌డీఏ మధ్య సయోధ్య కుదరడంతో 2019లో వివాదం సద్దుమణిగింది. అదే సమయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సదరు సంస్థకు స్టాంపు డ్యూటీ మినహాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం సదరు ప్రైవేటు సంస్థ తమకు స్టాంపు డ్యూటీ లేకుండా 50 ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేయాలని గత ఏడాది విశాఖలోని ఓ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించింది. అయితే ప్రస్తుతం రుషికొండలోని ఆ సంస్థకు చెందిన భూముల విలువ రూ.600 కోట్లు ఉండగా అందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ రూ.45 కోట్లు వరకు ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు లెక్కించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను నిలిపేసి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చిన జీవోతో కూడిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
పురపాలక శాఖ ఇచ్చిన జీవోను తిరస్కరించి, స్టాంపు డ్యూటీ చెల్లించాల్సిందేనని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేసింది. తమది రెవెన్యూ పరిధిలో ఉన్నందున పురపాలక శాఖ జీవో చెల్లదని, ఇలా చేస్తే ప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ప్రైవేటు సంస్థ ఆశ్రయించింది.
ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందనేది అప్రస్తుతమని, ప్రభుత్వ జీవోను అమలు చేయాల్సిందేనంటూ తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ రిజిస్ట్రేషన్ శాఖ అప్పీలు చేసుకునేందుకు సిద్ధమైంది.
ఈ వ్యవహారంలో ప్రస్తుతం విశాఖ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఎటువైపు వెళ్లినా ఇబ్బందిగా మారడంతో సతమతమవుతున్నారు. తమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి స్టాంపు డ్యూటీ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే సంబంధిత అధికారులు పన్ను ఆదాయంపై జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కింద ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు.
ఇదీ చదవండి: అమరావతి భూముల కేసులో స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ