విశాఖ జిల్లా భీమునిపట్నం చిట్టివలస బంతాట మైదానంలో చిట్టివలస జూట్ మిల్లు కార్మికులకు బకాయిల చెల్లింపుపై అభిప్రాయాల సేకరణ సమావేశం జరిగింది. ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జూట్ మిల్లు అక్రమ లాకౌట్ కాలం నుంచి ఇప్పటి వరకూ వేతనంతో కూడిన బకాయిలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. అంతవరకూ చిట్టివలస జూట్ క్వార్టర్స్ ను ఖాళీ చేసే ప్రసక్తే లేదని కార్మికులు తేల్చి చెప్పారు.
2009 ఏప్రిల్ 20 తేదీన చిట్టివలస జూట్ మిల్ కు లాకౌట్ ప్రకటించారు. నాటి నుంచి ఎన్నో ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు జరిగాయి. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జూట్ మిల్ శాశ్వత కార్మికులకు 25 వేలు, తాత్కాలిక కార్మికులకు పది వేలు చొప్పున ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పత్రాలపై ఐఎన్టీయూసీ కాంగ్రెస్ కార్మిక సంఘాలు మాత్రమే సంతకాలు చేయగా.. తాజాగా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్బంగా కార్మిక సంఘ నాయకుల తీరుపై.. పలువురు బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.