జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని పరదేశిపాలెంలో పెద్ద ఎత్తున మూడంతస్తుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో భారీగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గుత్తేదారుతో అప్పటి చీఫ్ ఇంజినీర్ బి.జయరామిరెడ్డి కుమ్మక్కయ్యరని, అందులో ఏడుగురు సబ్ ఇంజినీర్ల పాత్ర ఉందని విజిలెన్స్ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ విషయంపై అంతర్గత విచారణ చేపట్టారు. సర్వే నెంబర్ 21లో జీ+త్రీ, 29వ బ్లాక్‌లోని 928 ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు కుమ్మక్కయ్యారన్నది విజిలెన్స్ నివేదిక సారాంశం.
2019 సెప్టెంబర్ నుంచి ఈ విషయంపై విచారణ ఆరంభమైంది. అంతర్గత విచారణ అధికారిగా జీవీఎంసీ అధికారి శివప్రసాదరాజు వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పటికే రిటైరైన చీఫ్ ఇంజినీర్ జయరామిరెడ్డి సహా.. టి.మోజెస్ కుమార్, ఎ.ఉమామహేశ్వరరావు, జి.గోవిందరావు, కె.శాంసన్ రాజు, టి.రాయల్ బాబు, డి.శ్రీరామమూర్తి, సి.హెచ్. సుబ్రమణ్యరాజు తమ తప్పేమీ లేదంటూ రాతపూర్వకంగా వాదనలు సమర్పించారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ అధికారిగా విశాఖ ఏసీబీ డీఎస్పీ రంగరాజును నియమిస్తూ మునిసిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.