పది రోజులు కురిసిన వర్షాలకు విశాఖ జిల్లాలోని సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాలకు ఆశాజనకంగా నీటి నిల్వలు చేరాయి. ప్రధాన జలాశయాల్లోకి సుమారు 59 టీఎంసీల నీరు చేరినట్లు జెన్‌కో అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం జోలాపుట్‌లో 21, బలిమెలలో 55.77 టీఎంసీల నీరుంది. డొంకరాయి జలాశయంలో 18 టీఎంసీల నీరు ఉండగా... ప్రస్తుతం నాలుగు వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ పది రోజుల్లోనే బలిమెల జలాశయానికి 36 టీఎంసీలు, జోలాపుట్‌లోకి ఏడు టీఎంసీలు, డొంకరాయిలో 16 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు లెక్కగట్టారు. సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాలకు సుమారు 59 టీఎంసీల నీరు చేరింది.
ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలో ఏపీ వాటాగా 28 టీఎంసీలు... డొంకరాయి, సీలేరులో 15 టీఎంసీలు ఉంది. రాష్ట్ర వాటాగా మొత్తం 43 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఈ నీటి నిల్వలతో రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ఏపీ జెన్‌కో పర్యవేక్షక ఇంజనీరు రామ కోటిలింగేశ్వరరావు వెల్లడించారు.
ఇదీ చదవండి
అతిధి గృహ నిర్మాణానికి చర్యలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశా: ఆర్ఆర్ఆర్