అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సన్నద్దతలో భాగంగా విశాఖ సాగర తీరంలో అవగాహనా నడక కార్యక్రమం జరిగింది. కొత్తవలసకు చెందిన శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి ఆరంభమైన నడకలో దివ్యాంగులైన చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఈ నడకను ఆరంభించారు. దివ్యాంగులంటే ఉన్న అంగాలనే దివ్యంగా ఉపయోగించుకుని సమాజంలో తమకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారని కమిషనర్ అన్నారు. అటువంటి వారికి సమాజం అండగా నిలవడం ద్వారా మానవత్వపు విలువలను పెంచాలన్నారు. గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్... దివ్యాంగులకు ఆసరాగా అనేక కార్యక్రమాలు చేస్తోందని కొనియాడారు. దివ్యాంగులు సమాజానికి భారం కాదని, వారిలో అనేక రకాల ప్రతిభ దాగి ఉందని గీతం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శివరామకృష్ణ అన్నారు.
ఇదీ చూడండి: జిల్లాస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు ప్రారంభం