విశాఖ జిల్లా పెందుర్తి సబ్బవరంలో డబ్బు కోసం కుమారుడిపై దాడి చేసి, పెళ్లిని చెడగొట్టాలనుకున్నాడు ఓ తండ్రి. ఆసకపల్లికి చెందిన రోమాల అప్పారావుకు ఇద్దరు భార్యలు. రెండో భార్య అప్పాయ్యమ్మ కుమారుడు అప్పల నాయుడు ఎయిర్ ఇండియాలో పని చేస్తున్నాడు. ఈనెల 6న విజయనగరం జిల్లాకు చెందిన యువతితో అతని పెళ్లి నిశ్చయమైంది. ఈ మధ్య కాలంలో అప్పారావు అప్పులు బాగా చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక రెండో భార్య కుమారుడిని ఆశ్రయించాడు. తనకు 10 లక్షలు ఇవ్వాలని అడిగాడు. ఇంతవరకు తమను పట్టించుకోని తండ్రికి డబ్బులు ఇచ్చేందుకు కుమారుడు నిరాకరించాడు. డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో కుమారుడి వివాహం చెడగొట్టాలని భావించాడు తండ్రి అప్పారావు.
ఆరుగురు వ్యక్తులను కుమారుడిపై దాడి చేసేందుకు పురమాయించాడు. వీరంతా ఈనెల 3న బాధితుడికి వరసకు మామైన రమణపై దాడికి ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వారిని అడ్డగించారు. వారిలో నలుగురు దుండగులు పారిపోగా.. తండ్రి అప్పారావు, దాడిలో పాల్గొన్న మరో వ్యక్తి రమేష్ వినయ్‌ను పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...