విశాఖ పోర్టు ట్రస్ట్‌లో అభిజిత్ ఫెర్రో టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన రూ.35 లక్షల విలువజేసే మాంగనీస్ చోరీ(manganese theft case) కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. విశాఖలోని కొబ్బరితోట ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ ఎల్లయమ్మ(38) అనే మహిళ నేతృత్వంలో 11 మంది సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు డీసీపీ పేర్కొన్నారు. విశాఖ పోర్టుకు వెసెల్ (షిప్) ద్వారా 3,654 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ఓర్ వచ్చింది. దానిని పోర్టులో ఎల్- 17 స్టాక్ యార్డులో డంప్ చేశారు. స్టాక్ పాయింట్ నుంచి ఈనెల 24న 250 మెట్రిక్ టన్నుల మాంగనీస్ చోరీకి గురైనట్లు సినర్జీస్ షిప్పింగ్స్ సంస్థ గుర్తించి హార్బర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక పోలీస్ బృందం 11 మంది సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వారిలో 9 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారు నేరాన్ని అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. చల్లపల్లి ఎల్లయ్యమ్మ అనే రౌడీ షీటర్ ఇందులో కీలక సూత్రధారి కాగా..ఆమెపై మొత్తం 15 కేసులు ఉన్నాయన్నారు. సెక్యూరిటీ గార్డుల సాయంతో లోడు తరలించారని వివరించారు. చోరీ చేసిన మాంగనీస్‌ను బొబ్బిలికి చెందిన తిరుమల ట్రేడర్స్, జయమారుతి, ట్రస్ట్ మెటీరియల్ సంస్థలు కొనుగోలు చేశాయన్నారు. చోరీకి వినియోగించిన రెండు లారీలు, ఒక డంపర్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి