Old Man Mercy Killing Application in AP: ఆయన ఒక 74 ఏళ్ల విశ్రాంత ఏఎస్‌ఐ విశాఖ నగరంలోని మధుర వాడ కాలనీలో అప్పటి వుడా అనుమతించిన లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలుచేశారు. ఆ భూమిని 22ఎ నిషేధిత జాబితాలో పెట్టారని వెల్లడించారు. ప్రభుత్వ భూమి ఉంటే తీసుకోవాలని పలు మార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత భూముల జాబితాలో కొనసాగించడం వల్ల అమ్మకాలు కొనుగోళ్లకు అవకాశం లేక తాము తీవ్ర ఆర్ధిక ఇబ్బందు పడుతున్నట్లు పేర్కొన్నారు.
కేవలం ప్రభుత్వాధికారుల తప్పిదం వల్లనే తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయామన్నారు. పలుమార్లు స్పందనలో వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. చేసేది లేక కారుణ్య మరణానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునకు దరఖాస్తు పెట్టుకుంటే.. ఆయన చచ్చిపోండని దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. 74 ఏళ్ల వయస్సులో ఇంకెంతకాలం పోరాడగలనని విశ్రాంత ఏఎస్‌ఐ కాజా చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
'దాదాపు ఆరేడేళ్లుగా తిరుగుతున్నాం. మా సమస్య పరిష్కరించడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదుల సార్లు అర్జీలు ఇచ్చాం. ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు విన్నవించని అధికారి లేడు. స్పందనలో పలు మార్లు ఇచ్చిన అంశాలపైనా ఏనాడు ఒక చర్యలేదు. తమను కారుణ్య మరణానికి అనుమతించాలని ప్రభుత్వానికి అర్జీ పెడితే జిల్లా కలెక్టర్ చచ్చి పొండని దురుసుగా ప్రవర్తించడం పై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను.'- కాజా చిన్నారావు
ఇవీ చదవండి: