విశాఖలోని పోలీస్ పరేడ్ మైదానంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇంఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ, స్కౌట్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అభివృద్ధి కార్యక్రమాల నివేదికను వివరించారు. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ఆయా శాఖలు నిర్వహించిన శకటాల కవాతు ఆకట్టుకుంది.
విక్టరీ ఎట్సీ ...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...అమరవీరులకు విశాఖలో నౌకాదళం నివాళులు అర్పించింది. బీచ్ రోడ్ లోని విక్టరీ ఎట్సీ స్మారక స్థూపం వద్ద అమర వీరులకు నౌకాదళం ఘనంగా నివాళులు అర్పించింది. తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ స్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి అంజలి ఘటించారు. పరేడ్ సమయంలోనే పెద్ద ఎత్తున వర్షం కురవటంతో...కార్యక్రమాన్ని కొంతవరకు కుదించారు. వర్షంలోనే వైస్ అడ్మిరల్ ఏకే జైన్ నావికుల నుంచి వందనం స్వీకరించారు.
పోర్టు స్టేడియంలో...
విశాఖ పోర్టు స్టేడియంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో... రేవు డిప్యూటీ ఛైర్మన్ పి.ఎల్. హరినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ రేవు దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందన్నారు.
రైల్వే ఫుట్ బాల్ క్రీడా మైదానంలో...
తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. రైల్వే ఫుట్ బాల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రైల్వే రక్షణ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్పీఎఫ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు నిర్వహించిన కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది.
పాడేరు..
విశాఖ మన్యం పాడేరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో... ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు విద్యార్థులు ప్రత్యేక వాయిద్యాలతో ఆహ్వానం పలికారు.
పాయకరావుపేటఎంపీడీవో కార్యాలయం వద్ద....
పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. స్వాతంత్ర్య అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ధ్యేయంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాయకరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై విభూషణ రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.